తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో ఉండే మల్కాజిగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు గ్రేటర్ బాధ్యతలు ఇవ్వనప్పటికి స్థానిక ఎంపీగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులతో.. కేటీఆర్ ను కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండురోజులుగా కురిసిన వర్షాలతో శివారు కాలనీలు నీట మునిగాయి. దాంతో రేవంత్ ఆ కాలనీల్లో ప్రత్యక్షమయ్యారు.
తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్లో ఆయన విస్తృతంగా పర్యటించడమే కాదు.. మంత్రి అయిన కేటీఆర్ కు ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నికల సన్నద్ధత కోసం కేటీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రోజుకు ఒక్క సారి అయినా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ హైలెట్ చేస్తున్నారు. ఎప్పుడూ వీడియో కాన్ఫరెన్స్‌ల్లో కేటీఆర్ ఉంటున్నారని.. ప్రజలు నీళ్లలో మునిగితే కనిపించరా అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కొద్ది రోజులుగా గ్రేటర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం.. శంకుస్థాపన చేయడం చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇస్తుందన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. తనపై ఎన్ని రూమర్స్ వస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం.. తన దైన శైలిలో పని చేసుకుంటూనే పోతున్నారు. కేటీఆర్, కేసీఆర్‌లను టార్గెట్ చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేవంత్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.. ఎన్నికల ఫలితాల్లోనే తేలుతుంది..!