తెలంగాణ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అసలు ఉనికి ఉందో లేదో అనే పరిస్థితికి వెళ్లిన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నాయకత్వ సమస్య ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను తొలగించాలని చంద్రబాబుకు కూడా లేఖ రాశారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ… ఎల్.రమణ మాత్రం కాస్త యాక్టివ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఆయన రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే పట్టచభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.
ఓ స్థానంలో కోదండరాం పోటీ చేయనున్నారు. అక్కడ కాకుండా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ నేతను నిలబెట్టాలనే ఆలోచనను ఎల్.రమణ ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ తరపున అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు ఓ లింక్ పంపి.. సర్వే చేస్తున్నారు. ఎక్కువ మంది పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు.
విద్యావంతుల్లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ భావిస్తోంది. ఇప్పటి నుండే యాక్టివ్ అయితే.. ముందు ముందు మరింత మెరుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. కొంత మంది నేతలు.. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. మరి రమణ.. ఇలా పోటీ విషయంలో ముందుకే వెళతారా.. లేకపోతే.. వెనక్కి తగ్గుతారా అన్నది .. టీ టీడీపీ నేతల్లోనే చాలా మందికి క్లారిటీ లేదు.