తెలుగు చిత్రసీమకు స్టూడియోల కొదవ లేదు. అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయా, సారధి.. ఇలా హైదరాబాద్ నగరంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు సగం షూటింగులు అక్కడే జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా ప్రసాద్ లాబ్‌లోనే. ఆ తరవాత రామానాయుడు కూడా బిజీనే. ఇప్పుడు మరో స్టూడియో రాబోతోంది. అదే… `అల్లు స్టూడియోస్`.
తెలుగు చిత్రసీమ గర్వించదగిన నటుడు అల్లు రామలింగయ్య. దాదాపు వేయి సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలు దక్కాయి. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అరవింద్ సినిమాలు తీస్తున్నారు. అల్లుని ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఇప్పుడు `అల్లు స్టూడియో`ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో తొలి ప్రైవేటు స్టూడియో.. ఇదే. ఎందుకంటే ఇప్పటి వరకూ నిర్మించిన స్టూడియోలకు ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ప్రొత్సహించింది. అల్లూ స్టూడియోని కోకా పేటలో ఏడున్నర ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అదీ సొంత స్థలంలో. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలన్నది అల్లు అరవింద్ ప్రయత్నం. అల్లు అరవింద్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. ఈసారీ అంతే. అధునాతక టెక్నాలజీని ఉపయోగించి ఈ స్టూడియో నిర్మించబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌కి సంబంధించిన అన్ని పనులూ నిర్వహించునేందుకు వీలుగా స్టూడియో నిర్మాణం జరగబోతోందని, ఇండోర్ షూటింగ్‌కి అనుగుణంగా కొన్ని ఫ్లోర్లూ నిర్మించనున్నారని తెలుస్తోంది.
ఆహా కోసం వీలైనన్ని వెబ్ సిరీస్‌లు, షోలూ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అల్లు అరవింద్. దానికి సంబంధించిన పనులన్నీ ఇక మీదట ఈ స్టూడియోలోనే సాగుతాయి. ఎక్కువగా ఓటీటీ, మినీ మూవీస్ లక్ష్యంగా ఈ స్టూడియో నిర్మాణం జరగబోతోందని తెలుస్తోంది. మెగా కుటుంబంలో హీరోలకు కొదవ లేదు. వాళ్ల సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకున్నా.. ఈ స్టూడియోకి బోలెడంత పని. పైగా గీతా ఆర్ట్స్, జీఏ 2 సంస్థలపై విరివిగా చిన్న సినిమాలు తీయాలని అల్లు అరవింద్ వ్యూహం. వీటి పనులన్నీ ఇక మీదట ఇక్కడే చేసుకోవొచ్చది అల్లు ప్లాన్.