తెలుగు360 రేటింగ్ 2/5
పొడుపు కథ వేయడంలో కాదు. దాన్ని విప్పడంలో అంతకంటే ఎక్కువ మజా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్లర్ అనేసరికి ఎన్నో ప్రశ్నలు. అదెలా, ఇదెందుకు, తరవాతేంటి? అంటూ ఊపిరి సలపనివ్వని ప్రశ్నలు. ఇవి ఎవరైనా వేసేయగలరు. కానీ… సమాధానాలు రాబట్టడం, అందులోనూ ప్రేక్షకుడి ఊహకు అందకుండా చిక్కు ముడి విప్పడంలోనే అసలు ఆట ఉంది. `నిశ్శబ్దం` చుట్టూ చాలా ప్రశ్నలున్నాయి. కానీ… వాటికి సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయా? ప్రేక్షకుడి ఊహకు అందని ట్విస్టులు `నిశ్శబ్దం`లో కనిపిస్తాయా?
సాక్షి (అనుష్క) ఓ చిత్రకారిణి. తనకు వినిపించదు. మాట్లాడలేదు. సోనాలీ (షాలినీ పాండే) తన స్నేహితురాలు. సోనాలి మనస్తత్వం విచిత్రంగాఉంటుంది. సాక్షి ఎవరికైనా దగ్గర అయితే అస్సలు తట్టుకోదు. అమెరికాలోని ప్రఖ్యాత మ్యుజీషియన్ ఆంటోనీ (మాధవన్) సాక్షి పెయింట్స్ చూసి ఇంప్రెస్ అవుతాడు. తన మంచి మనసు చూసి ఇష్టపడతాడు. క్రమంగా ఇద్దరూ దగ్గరవుతారు. ఓ పెయింటింగ్ కి రిప్లికా కోసం హాంటెడ్ హౌస్‌కి వెళ్లాలనుకుంటుంది సాక్షి. కానీ.. అక్కడ దెయ్యాలు ఉన్నాయని అందరి నమ్మకం. ఏళ్ల తరబడి ఆ హాంటెడ్ హౌస్ ఖాళీగానే ఉంటుంది. కానీ పెయింటింగ్ కోసం ఆంటోనీతో పాటు సాక్షి అక్కడికి వెళ్తుంది. వెళ్లిన రోజే… ఆంటోనీ ని దారుణంగా చంపేస్తారు. ఆంటోనిని చంపింది దెయ్యమేనా? ఇంకెవరైనానా? ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న మహా (అంజలి) ఎలాంటి నిజాల్ని వెదికి తీయగలిగింది? కేసు దర్యాప్తు ఎలా సాగింది? అనేదే `నిశ్శబ్దం` కథ.
థ్రిల్లర్ సినిమాకి కావల్సిన లక్షణాలు ఈ కథలో ఉన్నాయి. దాన్ని హారర్ జోనర్‌తో మొదలెట్టినా – ఆ ఇంట్లో దెయ్యం, గియ్యం ఏమీ లేదని కాసేపటికే తెలిసిపోతుంది. కథని సూటిగా, సుత్తి లేకుండా మొదలెట్టాడు దర్శకుడు. ఆంటోనీ హత్యతో దర్యాప్తు మొదలవుతుంది. ఆంటోనీ – సాక్షిల కథ, సోనానీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ మూడ్ ని చెడగొడుతుంటాయి. కానీ.. కీ పాయింట్స్ ఆయా ఎపిసోడ్స్‌లో ఉంటాయి కాబట్టి, వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఇంట్రవెల్ ట్విస్ట్ కాస్త షాకింగ్ గానే ఉంటుంది. కాకపోతే థ్రిల్లర్ కథల్ని తరచూ చూసేవాళ్లకు, లాజిక్కులు ఎక్కువగా వేసుకునేవాళ్లకు హంతకుడు ఎవరో ఊహించడం పెద్ద కష్టమేం కాదు.
ప్రతీ సైకోకీ ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇందులోనూ అంతే. కాకపోతే.. అది మరీ పేలవంగా ఉంది. వరుస హత్యలు చేసే కిల్లర్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ చూస్తే విస్తిపోతారంతా. సోనాక్షి మిస్సింగ్, ఆంటోనీ హత్య ఇవి రెండూ ఒక కథకు ముడి పెట్టడం మంచి స్క్రీన్ ప్లేనే. కాకపోతే.. దాన్ని ప్రజెంట్ చేసే విధానమే సరిగా నప్పలేదు. హారర్ మూడ్ ఇవ్వడానికి మొదట్లో చూపించిన పాసింగ్ సీన్లు చూస్తే దర్శకుడు ఇంకా వర్మ సినిమాల దగ్గరే ఆగిపోయాడేమో అనిపిస్తుంది. ఈ కథ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మహా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నడుస్తుంటుంది. కానీ సడన్ గా.. వివేక్ (సుబ్బరాజు) వచ్చి `ఇది మా కథ` అంటూ మరో కథ చెబుతుంటాడు. ఈ కథలోని మలుపులు విప్పడానికి దర్శకుడికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నిజానికి ఇన్వెస్టిగేషన్ లోనే అసలు నిజాలు తెలియడం థ్రిల్. అంతే తప్ప… ఓ పాత్ర ముందుకొచ్చి జరిగిన కథంతా పూస గుచ్చినట్టు చెప్పేస్తే.. అక్కడ ఇంటిలిజెన్సీ ఏముంటుంది? ఎప్పుడైతే ఓ పాత్ర ముందుకొచ్చి అప్పటి వరకూ అలా ఎందుకు జరిగిందో చెబుతూ పోతూ ఉంటే – సినిమాపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది.
అమెరికా నేపథ్యంలో సాగడం వల్ల, ఫారెన్ లొకేషన్ల మధ్య పాత కథ కాస్త కొత్త రంగులో కనిపిస్తుంటుంది. హాలీవుడ్ నటీనటుల్ని తీసుకొచ్చాం.. అని చెప్పారు గానీ, మైఖెల్ మడ్సన్ తప్ప మరెవ్వరూ తెరపై కనిపించలేదు. ఆ పాత్ర ఆయనచేత కాకుండా మరెవ్వరి చేతనైనా చేయించొచ్చు. అనుష్క మరీ బొద్దుగా తయారైపోయింది. మాటల్లేవు. అన్నీ సైగలే. సాధారణంగా ఇలాంటి పాత్రలొస్తే – ఏ కథానాయికైనా అవార్డు విన్నింగ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇవ్వొచ్చేమో అనుకుంటుంది. కానీ ఇందులో అనుష్క పాత్రని మరీ బొమ్మలా మార్చేశారు. మాధవన్ లుక్స్ ఆకట్టుకుంటాయి. ఇంతకు మించి ఈ పాత్ర గురించి ఏమీ చెప్పకూడదు. సుబ్బరాజుకి చాలా రోజుల తరవాత కాస్త నిడివి ఉన్న పాత్ర దొరికింది. మిగిలిన పాత్రలతో పోలిస్తే అంజలి, షాలినీ పాండే పాత్రలకే కాస్త ప్రాధాన్యం కనిపిస్తుంది.
లొకేషన్లు, బ్యాక్ డ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కాస్త ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తాయి. పాటలు అనవసరం. మర్డర్ మిస్టరీలు ఈమధ్య చాలా వచ్చాయి. వస్తున్నాయి. ఇంత మంది స్టార్స్ కలిసి ఓ మర్డర్ మిస్టరీ చేశారంటే.. ఏదో ఓ కొత్తదనం ఆశిస్తారు. కానీ… `నిశ్శబ్దం`లో అది కనిపించదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ మరీ తక్కువగా ఉండడంతో రెండు గంటల నిశ్శబ్దం.. నిశ్శబ్దంగా చూసేయడం మినహా పెద్దగా ఎంగేజ్ చేయదు.
తెలుగు360 రేటింగ్ 2/5