బాధితుడికి న్యాయం దక్కాలి. సరైన సమయంలో దక్కాలి. ఆలస్యమైనా అన్యాయం జరిగినట్లే. కానీ ఆలస్యమైనా అన్యాయమే జరిగితే ఇక చెప్పుకోవడానికి ఏముంటుంది..?. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విషయంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును చూసిన చాలా మందికి ఇదే తరహా అనుమానం వచ్చి ఉంటుంది. అందరూ నిర్దోషులేనని సీబీఐ కోర్టు తేల్చింది. మరి బాబ్రీ మసీదును ఎవరు కూల్చారు..? అక్కడ కర సేవకుల్ని ఉత్సాహ పరుస్తూ కూల్చండి అని నినాదాలిచ్చిన పెద్ద మనుషులు ఎవరు..? కాషాయ వస్త్రాలతో హింసాత్మకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఆ నేత ఎవరు..?. బలమైన సాక్ష్యాలు అంటే ఏమిటి..? కళ్ల ముందు కనిపించిన దృశ్యాలన్నీ కట్టు కథలుగా.. బలమైన సాక్ష్యాలుగా పనికి రానప్పుడు ఇక బాధితులకు ఏ సాక్ష్యం న్యాయం అందేలా చేయగలుగుతుంది..!
దేశానికి మాయని మచ్చ ఆ విధ్వంసం..!
భారత్ లౌకిక దేశం. అలాంటి దేశంలో జరగకూడదని ఘటన బాబ్రీ మసీదు విధ్వంసం. 1992 డిసెంబర్ 6 దేశ రాజకీయ చరిత్రలో మరిచిపోలేని రోజుగా చెప్పుకోకతప్పదు. పూజలు కోసం వచ్చినట్లు చెప్పుకున్న కర సేవకులు అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదును కూల్చివేశారు. రామజన్మభూమికి సంబంధించిన మందిరాన్ని కూల్చి మసీదు కట్టారని ఆరోపిస్తూ… దాన్ని నేలమట్టం చేశారు. బీజేపీ తొలి తరం నాయకులైన ఆడ్వాణీ, జోషి, ఉమా భారతి సహా పలువురు నేతలు పక్కనే వేదికపై ఉండి కూడా విధ్వంసాన్ని ఆపలేకపోయారని, కుట్ర చేశారని ఆరోపణలు వినపించాయి. ఈ దిశగా అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు కోర్టు 32 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. 1984లో ఆడ్వాణీ, బీజేపీ అధ్యక్షుడైన తర్వాతే రామజన్మభూమి ఉద్యమం రాజకీయ అజెండాగా మారింది. 1990లో రామాలయ నిర్మాణం కోసం ఆడ్వాణీ రథయాత్ర ప్రారంభించారు. బిహార్‌లో ఆడ్వాణీ అరెస్టుతో అప్పటికే అయోధ్య బయలుదేరిన కరసేవకులు హింసకు దిగారు. ఈ క్రమంలో పోలీసు చర్యలతో కొందరు కరసేవకులు చనిపోయారు. 1992లో ఆడ్వాణీ, ఇతర నేతల సాక్షిగా మసీదు నేలకూలింది. యూపీలో జరిగిన హిందూ – ముస్లిం ఘర్షణల్లో రెండు వేల మంది ప్రాణాలు వదిలారు. పగ, ప్రతీకారం అంటూ విశ్వ హిందూ పరిషత్ చేసిన దేశంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రెండు వర్గాల మధ్య విభజన రేఖ గీసింది.
భారతీయ జనతా పార్టీ పునాది ఆ కూల్చివేతలోనే..!
ఒకప్పుడు ఇద్దరు ఎంపీలతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తిరుగులేని మెజార్టీ సాధించిన తిరుగులేని శక్తిగా ఎదగడానికి పిల్లర్ ఈ బాబ్రీ మసీదు విధ్వంసమే. బాబ్రీ కేంమద్రంగా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందమని ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను విశ్లేషించకుండానే అర్థం చేసుకోవచ్చు. రామ జన్మభూమి ఉద్యమం సంఘ్ పరివార్‌తో కలిసి బీజేపీ వ్యూహాత్మకంగా ప్రారంభించింది. మితవాద రాజకీయాల కంటే అతివాద హిందూత్వమే పార్టీ ఎదుగుదలకు అనివార్యమని నిర్ణయించుకున్నారు. దేశంలో మతపరమైన విభజనలో బీజేపీ బాగానే లబ్ధి పొందింది. 1984 లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు లోక్ సభాస్థానాలున్న బీజేపీ 1996 ఎన్నికల్లో రామాలయ ఉద్యమం పుణ్యమాని ఏకంగా 161 స్థానాలకు చేరుకుంది. 1999 ఎన్నికల్లో బీజేపీ బలం 183 స్థానాలకు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పేందుకు వెనుకాడకూడదు. హిందీ బెల్టు రాష్ట్రాల్లో బీజేపీ అనేక పర్యాయాలు అధికారానికి వచ్చింది. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు బీజేపీకి కంచుకోటలుగా మారాయి. అంటే బాబ్రీ ద్వారా అంతిమంగా లాభపడింది బీజేపీనేనని ప్రత్యేకంగా సాక్ష్యాలు చూపించాల్సిన పని లేదు.
28 ఏళ్ల విచారణలో సాక్ష్యాలు బలం కోల్పోయాయా..?
బాబ్రీ మసీదు కేసు విచారణ 28 సంవత్సరాల పాటు జరిగింది. మొదట ఈ కేసు రెండు కోర్టుల్లో విచారణ జరిగింది. నేతలపై కుట్ర కేసు రాయ్‌బరేలీ కోర్టులోనూ, కూల్చివేసిన గుర్తు తెలియని కర సేవకుల కేసు లఖ్‌నవ్ సీబీఐ కోర్టులోనూ జరిగింది. రెండు కేసులను కలిపి విచారించేందుకు సుప్రీం కోర్టు 2012లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దానిపై విచారణకు కేంద్రప్రభుత్వం జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నియమించింది. మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా… లిబర్హాన్ కమిషన్‌కు 48 సార్లు పొడిగింపు ఇచ్చారు. దానితో 17 సంవత్సరాల తర్వాత 2009 జూన్ 30 జస్టిస్ లిబర్హాన్ తన నివేదికను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సమర్పించారు. యూపీలో అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ బుద్ధిపూర్వక ఉదాసీనతను పాటించడం వల్లే మసీదు కూల్చివేతకు గురైందని జస్టిన్ లిబర్హాన్ అభిప్రాయపడ్డారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీలకు అనుకూలురైన అధికారులను నియమించడం ద్వారా కరసేవకులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఆపారని లిబర్హాన్ తేల్చారు.
బీజేపీ పాతుకుపోయింది.. రామాలయం వస్తోంది.. నిందితులు నిర్దోషులయ్యారు..! మరి బలైన వారికి న్యాయం ఏది..?
రామ జన్మభూమి భూ వివాదానికి సంబంధించిన కేసును 2019లో నవంబరులో సుప్రీం కోర్టు తేల్చేసింది. ఆలయ నిర్మాణానికి సానుకూల పరిస్తితులు సృష్టించడంతో ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు అదే అయోధ్య కేసులో ఉన్న బీజేపీ సీనియర్ నేతలంతా బయటపడ్డారు. నిర్దోషులయ్యారు. అదే సమయంలో బీజేపీ బాబ్రీ ఘటనను పిల్లర్‌గా చేసుకుని దేశంలో పాతుకుపోయింది. బీజేపీ అనుకున్నది సాధించింది. దేశంలో నెంబర్ వన్ పార్టీగా ఉండాలనుకుంది. వచ్చింది. వారు అనుకున్నట్లుగా బీజేపీ గెలిచింది.. రామాలయం వస్తోంది.. ఈ ఘటనలు మొత్తానికి కారణం అయిన వారికి క్లీన్ చిట్ వచ్చింది. కానీ ఆ విద్వేషాలకు బలైన వారికి మాత్రం న్యాయం జరగలేదు. జరగదు కూడా..!
బాబ్రీ తీర్పును చూపించి … కోర్టే చెప్పింది కాబట్టి… అక్కడ కుట్ర జరగలేదని.. చెబితే.. నమ్మేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ వ్యవస్థలపై మాత్రం నమ్మకం కోల్పోతారు. దేశంలో మారుతున్న పరిస్థితులకు ఇదే కీలకంగా మారుతోంది. ఇది ప్రమాదకర ధోరణి. చాలా మంది సీబీఐ అధికారుల దర్యాప్తుపై అసంతృప్తితో ఉన్నారు. కానీ బయటకు చెప్పలేరు. ఎందుకంటే.. అలాంటి స్వేచ్చ కూడా దేశంలో తగ్గిపోయింది. ఇలాంటివి అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకే… ఏపీ బీజేపీ నేతలు మాకు కూడా బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్యాన్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ.. నిర్భయంగా అభిప్రాయాలు వెల్లడించగల ప్రజాస్వామ్య దేశంలో మా బాధ్యత మేము నిర్వర్తించాల్సిందే.. !