తెలంగాణకు రావాల్సిన నీటి కోసం.. దేవునితోనై కొట్లాటకు సిద్దమని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు.. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై వరుసగా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్… ఒక రోజు ఏపీనే కెలికి కయ్యం పెట్టుకుంటోందని విమర్శించారు. మరో రోజు దేవునితో కొట్లాకైనా సిద్దమని ప్రకటించారు. దీంతో ఆయన ఏపీ సర్కార్‌పై తీవ్ర స్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నారన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కానీ రేవంత్ రెడ్డి లాంటి కొంత మంది మాత్రం కేసీఆర్ మాటల్లో తేడాను గుర్తించాలని అంటున్నారు. ఓ వైపు మాటలు చెబుతూ.. మరో వైపు.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కాంట్రాక్టుల గూడుపుఠాణి చేస్తున్న విషయాన్ని రేవంత్ తాను రాసిన లేఖలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వాస్తవానికి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు లెవనెత్తడం దగ్గర్నుంచి తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం వరకూ.. చాలా అంశాలపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మామూలుగా అయితే.. ఏపీ సర్కార్ ఓ చిన్న అభ్యంతరం తెలిపినా… ఆ విషయాన్ని ఆయన సెంటిమెంట్ రగిల్చడానికి ఉపయోగించుకుంటారు. గత ప్రభుత్వం కృష్ణాబోర్డుకు రాసిన లేఖలను ఎన్నికల సమయంలో ప్రింట్లుగా తీసి ప్రజలకు పంపి…మన నీటిని ఏపీకి ధారదత్తం చేద్దామా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంలో కేసీఆర్ లాంగ్వేజ్ చాలా పక్కాగా ఉంటుంది. వినే తెలంగాణ వాసుల రక్తం ఉడికిపోయేలా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటతీరులో స్పష్టమైన తేడా ఉంది.
ఇంత జరుగుతున్న కేసీఆర్ ఒక్క సారంటే ఒక్క సారి కూడా జగన్ పేరు ప్రస్తావించలేదు. ఏపీ ప్రభుత్వం అంటున్నారు.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్దమంటున్నారు కానీ… జగన్ కేమీ తెలియదన్నట్లుగా ఉంటున్నారు. అక్కడే కేసీఆర్ తీరుపై చాలా మందిలో అనుమానాలు వస్తున్నాయి . తెలంగాణకు అన్యాయం జరుగుతూంటే.. కేసీఆర్ తరహా స్పందన రావడం లేదని.. దీని వెనుక ఏదో ఉందన్న అభిప్రాయానికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేతుల… లేఖలతో ఈ అనుమానాలను మరింతగా పెంచుతున్నారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య రాజకీయంగా మంచి అవగాహన ఉందని ఇప్పటికే అనేక సార్లు రుజువు అయింది. ఇప్పటికీ వారి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ వాటి ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే.. రాజకీయంగా ఏమి ఉపయోగం అనుకున్నారో కానీ.. సమస్యలను రాజకీయ సమస్యలుగానే ఉంచుకుంటే మంచిదన్న రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరికి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా ప్రారంభం కాకపోవడం దీనికి సాక్ష్యమంటున్నారు. మొత్తానికి ప్రజాప్రయోజనాల కన్నా… సీఎంలు ఇద్దరూ కలసి కట్టుగా రాజకీయ ప్రయోజనాల కోసం లోపల స్నేహం.. బయట విరోధం వ్యూహం అమలు చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.