ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై హైకోర్టు పదే పదే ఆగ్రహం చేస్తున్న విషయం తరచూ వార్తల్లోకి వస్తోంది కానీ.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసుల మరో ఘనత సాధించారు. అదే మొదటి స్థానం. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా..ఏపీ పోలీసులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ విభాగం.. కేసులు ఉండటం. పోలీసుల్లోనే నేరాభియోగాలు ఎదుర్కొంటూ .. కేసులు ఉన్న వారు అత్యధికంగా ఉన్న పోలీస్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్‌దే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ విషయాలను వెల్లడించింది. ఏపీ పోలీసుల్లో 1681 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 403 మంది పోలీసులపై మాత్రమే కేసులు ఉన్నాయి. అంటే.. మొదటి స్థానంలో ఉన్న ఏపీకి.. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు మధ్య హస్తిమశకాంతరం ఉంది. పన్నెండు వందల మందికిపైగా ఎక్కువ మంది పోలీసులు నేరాల్లో ఇరుక్కున్నారు. కేసుల పాలయ్యారు.
మూడో స్థానంలో ఉన్న అస్సాం పోలీసులపై ఉన్న కేసుల సంఖ్య 397. పోలీసులపై కేసులు తప్పనిసరిగానే నమోదు చేస్తారు. అంటే.. ఇక తప్పదనుకుంటేనే కేసు నమోదు చేస్తారు. ఇక దర్యాప్తు చేయాల్సింది కూడా పోలీసులే కదా.. వారిపై కేసుల్ని వారే దర్యాప్తు చేస్తారా..? చేయాల్సి వస్తే ఎలా చేస్తారు..?. ఆ కేసులు తేలిపోయేలా చేస్తారు. ఏపీలో కూడా అదే జరుగుతోంది. 1600 మందికిపైగా పోలీసులపై కేసులు ఉన్నా ఎనిమిది అంటే ఎనిమిది కేసుల్లోనే విచారణ పూర్తయింది. అన్ని కేసుల్లోనూ నేరారోపణలు ఎదుర్కొన్న పోలీసులు నిర్దోషులుగా బయటపడ్డారు. 55 కేసుల్లో విచారణ పూర్తయింది. తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. కోర్టులు ఎనిమిది కేసుల్ని క్వాష్ చేశాయి. ఏడు కేసుల్ని ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.
మొత్తం మీద పోలీసులు రాజకీయ నేతల గుప్పిట్లో చిక్కుకుపోవడం వల్ల… వారు ఇలా కేసుల పాలవ్వాల్సి వస్తోందనేది అందరూ అంచనా వేసే అంశం. అయితే ఏపీ పోలీసుల్లో చాలా మంది మద్యం స్మగ్లింగ్, ఇసుక అక్రమరవాణాల్లో ఉంటున్నారు. సాక్షాత్తూ డీజీపీనే పోలీసులు టెంప్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. అనేక మంది పోలీసులను ఆ కేసుల్లో బుక్ చేశామని చెప్పారు. పోలీస్ బాసే అలా చెప్పి న తరవాత నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌లో అంత కన్నాభిన్నంగా వచ్చే అవకాశం లేదు.