ఇది వరకు ఓ సినిమా ఫ్లాపయితే.. `పాపం నిర్మాత..`, `అయ్యో.. డిస్ట్రిబ్యూటర్` అంటూ సంతాపాలు వ్యక్తం చేసేవారంతా. ఇప్పుడు మాత్రం `అయ్యో.. ఓటీటీ` అనుకోవాల్సిందే. ఎందుకంటే.. ఈమధ్య చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. చిన్నా చితకా సినిమాలు పక్కన పెడితే… పెంగ్విన్, వి, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలూ ఓటీటీనే వెదుక్కుంటూ వచ్చాయి. ఈ మూడు సినిమాలూ అమేజాన్ప్రైమ్ ద్వారానే విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలకూ దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకూ కేటాయించింది అమేజాన్. ఓ స్టార్ హీరో సినిమా బడ్జెట్ ఇది. దాంతో ఓ పెద్ద హీరోతో అమేజానే డైరెక్ట్‌గా ఓ సినిమా తీసేసుకోవొచ్చు. కానీ మూడు సినిమాలపై పెట్టుబడి పెట్టింది. తీరా చూస్తూ.. మూడూ ఫ్లాపే.
ఈ సినిమాలు చూసినవాళ్లు పెదవి విరిచారు. చూడని వాళ్లు `ఇంకేం చూస్తాంలే` అని లైట్ తీసుకుంటున్నారు. రెగ్యులర్ గా సినిమా చూసేవాళ్లకు ఎలాగూ అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటుంది.క కాబట్టి – ఈ సినిమాల వల్ల అమేజాన్ కి వచ్చే ప్రత్యేకమైన వ్యూవర్ షిప్ అంటూ ఏమీ ఉండదు. ఓవరాల్ గా ఈ సీజన్లో అమేజాన్ వాళ్లకు తెలుగు సినిమాల రూపంలో దెబ్బ మీద దెబ్బ పడినట్టే. `వి` సినిమా కొన్నా, తగిన ఫలితం లేకపోయే సరికి… అమేజాన్ ఇక తెలుగు సినిమాల జోలికి రాదనుకున్నారంతా. కానీ.. `నిశ్శబ్దం` కొనేసింది. అక్టోబరు 1 రాత్రి 10 గంటలకు విడుదలైన ఈ సినిమాని సినీ విశ్లేషకులు డిజాస్టర్ గా తేల్చేశారు. ఓటీటీలో ఎంత ఫ్రీగా వస్తున్నా – రెండు గంటల సమయం వృథా చేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. `నిశ్శబ్దం` కోసం సబ్‌స్క్రైబ్ చేసుకుందాం అనుకున్నవాళ్లు ఇప్పుడు వెనుకడుగు వేయొచ్చు. ఏ విధంగా చూసినా – వి, నిశ్శబ్దం చిత్రాలు అమేజాన్‌కి చేదు ఫలితాల్ని అందించాయి. అక్టోబరు 15 నుంచి ఎలాగూ థియేటర్లు తెరిచేస్తారు కాబట్టి, పెద్ద సినిమాలన్నీ ఓటీటీలవైపు చూడవు. తాజా ఫలితాలు చూశాక… ఓటీటీ సంస్థలు కూడా తెలుగు సినిమాలవైపు చూడ్డానికి ధైర్యం చేయవేమో..?