రాజకీయ డ్రామాలు ఆడటానికి రాజ్‌భవన్ వేదిక కాదంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల కిందట వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. కానీ రాజ్‌భవన్ ఇవ్వలేదు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని రాజ్‌భవన్ వర్గాలు సమాచారం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎవరెవర్ని కలిశారో వివరిస్తూ.. గవర్నర్ తీరుపై మండిపడ్డారు. రెండు, మూడు రోజులు ఈ విమర్శల్ని పట్టించుకోని గవర్నర్ తమిళిసై హఠాత్తుగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. వారు రాజకీయ డ్రామాలు చేయడానికి వచ్చారని నిందించారు. ఎవరైనా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.
అంతటితో వదిలి పెట్టలేదు. గతంలో కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ పై.. జాతీయ మీడియాతో మాట్లాడుతూ… వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తమిళిసై ఇప్పుడు మాట మార్చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ అద్బుతమైన ప్రగతి చూపించిందని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా రికవరీ కేసుల్లో తెలంగాణ ముందుందని .. దీనికి ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని ప్రశంసించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడి.. ప్రభుత్వంపై తమిళిసై ప్రశంసలు కురిపించడంతో చాలా మంది గతంలో నరసింహన్ తీరును గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో నరహింహన్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. కానీ విజ్ఞాపన పత్రం ఇచ్చిన తరవాత కాంగ్రెస్ నేతలపై నేరుగానే కామెంట్లు చేసేవారు. ఇప్పుడు తమిళిసై అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండానే విరుచుకుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలినట్లయింది.
నిజానికి రాజ్‌భవన్ అధికారాలు పరిమితం. గవర్నర్ నిమిత్తమాత్రుడని తెలిసినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యల కోసం.. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తూంటాయి. అది రాజకీయమే. అందరూ చేసేదే. బీజేపీ నేతలు కూడా అదే చేస్తారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు మాత్రమే… ఏదో రాజకీయ డ్రామాను రాజ్ భవన్ వేదికగా ఆడారని.. గవర్నర్ విమర్శించడంతో… కాంగ్రెస్ నేతలకు.. అంతర్గతంగా ఏదో జరిగిందన్న అనుమానం ప్రారంభమయింది. కొసమెరుపేమిటంటే… గవర్నర్ తమిళిసై భర్త సౌందర్ రాజన్‌ను సన్మానించారు. ఆయనకు బెస్ట్ మెడికల్ టీచర్‌గా ధన్వంతరి అవార్డు వచ్చిందని ఈ సత్కారం చేశారు.