భాగమతి తరవాత… అనుష్క నుంచి సినిమా ఏదీ రాలేదు. ‘నిశ్శబ్దం’ సెట్స్‌పైకి వెళ్లినా – పూర్తయి, ఓటీటీ ద్వారా విడుదల అవ్వడానికి ఇంతకాలం పట్టింది. ఈ సినిమా అనుష్కని మళ్లీ రేసులోకి తెస్తుందనుకుంటే… ఇదే తనకు అతి పెద్ద మైనస్ గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పోస్టరు పై మాధవన్, అంజలి లాంటి తారలు కనిపిస్తున్నా, ఇది అనుష్క సినిమాగానే ప్రచారం జరుపుకుంది. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా అంత రేటు పెట్టి కొన్నదంటే దానికి కారణం అదే. మొత్తానికి కాస్త లేట్ అయినా, బొమ్మ బయటకు వచ్చింది. తీరా చూస్తే – అనుష్క కెరీర్‌కి ఇదే పెద్ద ప్రతిబంధకంగా మారిపోయింది.
అనుష్క ఈ సినిమాలో చాలా లావుగా కనిపించింది. అనుష్కని, ఆమె పాత్రని దర్శకుడు సరైన రీతిలో వాడుకోలేకపోయాడు కూడా. పైగా నటిగా అనుష్క చేసిందేం లేదు. అనుష్క ప్లస్ పాయింట్స్ సైతం తెరపై సమర్థవంతంగా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. ఈ మైనస్సులన్నీ అనుష్క ఖాతాలో పడిపోయాయి. బాహుబలి తరవాత.. అనుష్క స్లిమ్ అవ్వడానికి ప్రయత్నించిందని, బరువు తగ్గిందని వార్తలొచ్చాయి. అయితే… ‘నిశ్శబ్దం’లో అవేం రిఫ్లెక్ట్ కాలేకపోయాయి. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలకు అనుష్కనే పెద్ద దిక్కు. ఇప్పుడు అలా కాదు. సమంత, కీర్తి సురేష్ లాంటి వాళ్లు పోటీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ఫ్లాపు చాలు కెరీర్ తారుమారు అవ్వడానికి, అవకాశాలు చేజారడానికి.
`బాహుబలి` తరవాత స్వీటీ కావాలనే బ్రేక్ తీసుకుంది. కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమైంది. వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్ని ఒప్పుకుంటోంది. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలున్నాయని అనుష్క ప్రకటించింది. మరి కొన్ని కథలు `నిశ్శబ్దం` రిజల్ట్ గురించి వెయిటింగ్. చేతిలో ఉన్న సినిమాల సంగతి సరే. రావాల్సిన సినిమాలు మాత్రం `నిశ్శబ్దం` తరవాత సైడ్ అయిపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా తన కెరీర్‌పై, ఎంచుకునే కథలపై, అంతకంటే ముఖ్యంగా శరీరాకృతిపై అనుష్క దృష్టి పెడితే మంచిది.