తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో జమిలీ ఎన్నికలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరో రెండేళ్లలోనే జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని పార్టీ క్యాడర్‌కు పదే పదే చెబుతున్నారు. ఆ మేరకు ఆయన రాజకీయ ప్రణాళికలు కూడా సిద్దం చేసుకుంటున్నారు. ఆన్ లైన్ ద్వారా.. పార్లమెంటరరీ నినియోజవర్గ స్థాయి నేతలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన అందరికీ ఒకటే చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయని.. అందరూ సిద్దంగా ఉండాలనే చెబుతున్నారు. చంద్రబాబుకు ఏదో సమాచారం ఉండబట్టే… ఈ విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
నిజానికి జమిలీ ఎన్నికల విషయంలో దేశవ్యాప్తంగా అంతర్గత చర్చ జరుగుతోంది. గత ఎన్నికలు ముగిసిన తరవాత 2022లోనే జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన కసరత్తును కూడా ప్రధానమంత్రి స్థాయిలో ప్రారంభమయింది. ఆ తరవాత అది అంతర్గతంగా జరుగుతూనే ఉందని చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఆ ప్లాన్లకు పులిస్టాప్ పడవచ్చని భావించారు. కానీ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ పరంగా.. బీజేపీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు మళ్లీ జమిలీ ఎన్నికల వ్యూహాల దిశగా వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించేలా చేశాయి. ఇటీవలి కాలంలో ఈ విషయంలో చంద్రబాబు కూడా… క్లారిటీకి వచ్చారు. జమిలీ ఖాయమని అంచనాకు వచ్చారు.
జమిలీ ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకం. గత ఎన్నికలకు ముందు లా కమిషన్‌కు లిఖిత పూర్వకంగా అదే విషయం తెలిపింది. కానీ ఇప్పుడు అనుకూలం. వైసీపీ గతంలో అనుకూలం.. . ఇప్పుడు వ్యతిరేకం. అయితే లా కమిషన్‌కు అనుకూలమైన ఎప్పుడో నివేదిక సమర్పించింది. దీంతో రికార్డుల్లో అనుకూలం అనే వాదన మాత్రమే ఉంటుంది. మెజార్టీ రాజకీయ పార్టీల ఆమోదాన్ని కేంద్రం ఇప్పటికే సేకరించింది. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలతో ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వారి వైపు నుంచి ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే.. జమిలీ ఎన్నికల కోసం చంద్రబాబు పార్టీని సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.