మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఏమిటో, అవి ఎలా ఉండాలో కోన వెంకట్ ని చూసి నేర్చుకోవాలి. అందుకు ఆయన తీసిన `నిశ్శబ్దం` సినిమానే అది పెద్ద ఉదాహరణ. ప్యాకింగ్ ఒకటి.. లోపల సరుకు ఇంకొకటి అన్నట్టు. పోస్టరుపైన, టీజర్లో, ట్రైలర్లో `ఇది అనుష్క సినిమా` అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే… అనుష్క ఓ పాత్ర మాత్రమే. నిజం చెప్పాలంటే ఇది అంజలి సినిమా. అంజలి పాయింట్ ఆఫ్ వ్యూలోంచే సినిమా మొదలవుతుంది. ముగుస్తుంది. కథని నడిపించేది, ఇన్వెస్టిగేషన్ ని నడిపించేది, చివర్లో అనుష్కని సేవ్ చేసి క్రెడిట్ కొట్టేసేది.. అంజలినే. ఇదేం తప్పు కాదు. కాకపోతే.. అనుష్కలాంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పుడు తన స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందని ఆశిస్తారంతా. అరుంధతి, భాగమతిలా.. ఇది కూడా అనుష్క సినిమానే అనుకుంటారు. కానీ ఆమెను మరో పాత్ర సైడ్ చేసేస్తే ఎక్కడో వెలితిగా ఉంటుంది. నిశ్శబ్దంలోనూ అదే జరిగింది.
ఎందుకో కోన వెంకట్ కి అంజలి అంటే స్పెషలాభిమానం. ఆయన తీసిన గీతాంజలిలో అంజలినే హీరోయిన్. ఆ తరవాతి తీసిన శంకరాభరణంలోనూ తననే తీసుకున్నాడు. ఇప్పుడు నిశ్శబ్దంలోనూ తననే హీరోయిన్ గాచేసేశాడు. కాకపోతే.. అనుష్క పేరు చెప్పి వ్యాపారం చేసుకోగలిగాడు. అనుష్కకి ఉన్న క్రేజ్ చూసే అమేజాన్ ఈ సినిమా అంత రేటు పెట్టి కొంది. సినిమా బాగుంటే, స్క్రీన్ స్పేస్ ఎక్కువ, తక్కువ అనే డిబేట్ రాకపోదును. విషయం లేకపోవడం వల్లే ఇది అనుష్క సినిమా కాదు కదా, అనే ప్రశ్న వస్తోంది. ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల ఈ సినిమాకొచ్చిన నష్టం ఎంత? అనేది స్పష్టంగా తెలియకపోవొచ్చు. ఆ వివరాలూ ఎప్పుడూ బయటకు రాకపోవొచ్చు. కానీ.. అదే థియేటర్లో విడుదలైతే, అనుష్క ఉంది కదా అని బయ్యర్లు ఎగబడి ఈ సినిమాని కొనేస్తే..? వాళ్లంతా ఇప్పుడు కోన వెంకట్ పై యుద్ధానికి దిగేవారేమో.
మొత్తానికి ఓటీటీ వల్ల లాభపడిన మరో సినిమా జాబితాలో `నిశ్శబ్దం` చేరిపోయింది. థియేటర్లో విడుదలైతే అటు బయ్యర్లు, ఇటు ప్రేక్షకులు బేజారైపోయేవాళ్లు. ఇప్పుడు ఆ బాధంతా అమేజాన్ వాళ్లే అనుభవించాలి.