అభిమానులే హీరోల బలం, బలహీనత. కొన్నికొన్నిసార్లు… మితిమీరిన అభిమానాన్ని హీరోలూ తట్టుకోలేరు. తిరిగి.. ఫ్యాన్స్ కే క్లాస్ పీకాల్సిన పరిస్థితి వస్తుంది. అల్లు అర్జున్ విషయంలో ఇదే జరిగింది. మాచెర్లకు చెందిన నాగేశ్వరరావు బన్నీ కి వీరాభిమాని. `అల వైకుంఠపురములో` ఇండ్రస్ట్రీ హిట్టు కొడితే… హైదరాబాద్ లోని బన్నీ ఇంటి వరకూ నడిచి వస్తానని మొక్కుకున్నాడట. ఆరు రోజుల పాటు కష్టపడి.. 200 కిలో మీటర్లు కాలినడక.. హైదరాబాద్ చేరుకున్నాడు. ఎట్టకేలకు బన్నీని కలుసుకుని, కాసేపు గడిపి, మధుర జ్ఞాపకాలతో ఇంటికెళ్లాడు.
నిజానికి బన్నీ కోసం ఓ అభిమాని కాలి నడకన వస్తున్నాడన్న సంగతి బన్నీ టీమ్ కి తెలిసింది. ఆ ప్రయత్నాన్ని ఆపాలని ప్రయత్నించారు. కానీ.. నాగేశ్వరరావు ఎవరి మాటా వినలేదు. బన్నీ హైదరాబాద్ నుంచి కారు పంపినా – కాలినడకనే హైదరాబాద్ వస్తానని మొండి పట్టుపట్టాడట. చివరికి తన పంతం నెగ్గించుకుని కాలి నడకన హైదరాబాద్ వచ్చాడు. దాంతో బన్నీ క్లాసు కూడా పీకాల్సివచ్చింది. `ఇక మీదట ఇలాంటి ప్రయత్నాలు చేయకు` అని అభిమానిని సున్నితంగా మందలించి, ఇంటికి పంపించాల్సివచ్చింది.