కరోనా పరిస్థితుల కారణంగా మన దేశంలో జరగాల్సిన ఐపీఎల్ కాస్త దుబాయ్ షిఫ్ట్ అయిపోయింది. ఆట ఇండియాలో అయినా, దుబాయ్ లో అయినా ఎలాగూ స్టేడియంకి వెళ్లి మ్యాచ్ చూసే అవకాశాలు లేవు కాబట్టి, క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ఒక్కటే. కానీ… ఆటగాళ్లు మాత్రం `ఇదేం దుబాయ్ బాబోయ్` అంటూ బేజారెత్తిపోతున్నారు. ఎందుకంటే అక్కడి వాతావరణం అలా ఉంది.
దుబాయ్‌లో సీతాకాలం ఎఫెక్ట్ అప్పుడే మొదలైపోయింది. రాత్రి వేళలో మంచు కురుస్తోంది. డ్యూ ఫ్యాక్టర్ వ్లల చేతుల్లోంచి బంతులూ జారిపోతున్నాయి. క్యాచ్‌లు నేల పాలు అవుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న సంగతులే. అందుకే టాస్ గెలిచినవాళ్లంతా తొలుత బౌలింగ్ తీసుకుంటున్నారు. అయితే.. ఎంత మంచు పడుతోందో, అంతే ఉక్క బోత వేస్తోందక్కడ. దాంతో.. ఆటగాళ్లు డీ హైడ్రేషన్ తో తల్లడిల్లిపోతున్నారు. పట్టుమని నాలుగు ఓవర్లు ఆడేసరికి.. చమటతో తడిసి ముద్దైపోతున్నారు. నిన్నటికి నిన్న ధోనీ.. వికెట్ల మధ్య పరుగులు పెట్టలేక అలసిపోయాడు. డీ హైడ్రేషన్ తో బాధ పడ్డాడు. ధోనీకి ఇదివరకెప్పుడూ ఇలా చూడలేదు. వయసు మీద పడుతున్నా ఫిట్ నెస్ విషయంలో… ధోనీ ఎవ్వరికీ తీసిపోడు. ఆ చురుకుదనం ఇప్పటికీ ఉంది.కానీ దుబాయ్ లో వాతావరణం ధోనీ లాంటి వాడ్ని సైతం ఇబ్బంది పెడుతోంది. ధోనీ సంగతి అటుంచండి.. యువ ఆటగాడు కిషన్ కూడా అంతే కదా. డీ హైడ్రేషన్ తో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కి రాలేకపోయాడు. అది ముంబై జట్టుపై విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. సూపర్ ఓవర్లో పరుగులు చేయలేక మ్యాచ్ ని బెంగళూరుకి సమర్పించుకున్నారు. డీవిలియర్స్ సైతం డీ హైడ్రేషన్ బారీన పడినవాడే. కనీసం మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకోవడానికి రావడానికి ఓపిక లేక.. అతని స్థానంలో కోహ్లీని పంపించాడు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఇలా ఉక్కబోతతో ఎదురీదుతున్నారు. ఈ సమయంలో ఇదే సిరీస్ ఇండియాలో జరిగి ఉంటే.. ఫలితాలు మరోలా ఉండేవి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి వాతావరణం చల్లగా ఉంది. మంచు ప్రభావం కూడా మొదలవ్వలేదు. అందుకే ఆటగాళ్లు సైతం `ఐపీఎల్ ఇండియాలో జరిగిఉంటే బాగుండేది` అంటూ ఫీలౌతున్నార్ట.