మున్సిపల్ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ నగరంలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. వీధులు కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా దుర్గంధం తాండవిస్తోంది. ప్రధాన యూనియన్లన్నీ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టాయి. ప్రభుత్వం మాత్రం చర్చల ఊసెత్తడం లేదు. శుక్రవారం ఒక యూనియన్ సమ్మె విరమణ ప్రకటనతో గందర గోళం సృష్టించే ప్రయత్నం జరిగింది. దీనిపై సమ్మెలోని కార్మిక సంఘాలు మండిపడ్డాయి.
తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం, అడగని వారికి తాయిలాలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. అడిగడటం తప్పు అన్నట్టు కార్మికుల డిమాండ్లను మొదట పట్టించుకోక పోవడం, తర్వాత అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చానని డాంబికం ప్రదర్శించడం అలవాటైంది. ఆర్టీసీ సమ్మె విషయంలో అదే జరిగింది. కార్మికులు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అన్ని రోజుల సమ్మె ఎందుకు జరగనిచ్చారో అర్థం కాదు. ప్రజలు అష్టకష్టాలు పడిన తర్వాత ప్రభుత్వం దేవదూతలా వరాలు ఇచ్చినట్టు స్పందించడం ఆశ్చర్యకరం.
ఇప్పుడు మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో అర్థం కాదు. రోడ్లు చెత్తతో నిండిపోతే వ్యాధులు ఎంత వేగంగా ప్రబలుతాయో ప్రభుత్వానికి తెలియదా? అడిగిన వారికి, అడగని వారికి పెన్షన్లు ఇస్తారు. అడగకపోయినా రంజాన్ మాసంలో విందులు, కానుకలు ఇస్తారు. కులానికో భవనానికి కోట్లు కేటాయిస్తారు. జీతాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసే కార్మికులను మాత్రం పట్టించుకోరు. బంగారు తెలంగాణ సాధిస్తామని ఊతపదం వల్లెవేసే ప్రభుత్వం పనితీరు విచిత్రంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. కొన్ని సార్లు ధనిక రాష్ట్రం అనే మాటకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి, అసలు పైసా పైసాకు కష్టపడే రాష్ట్రంలా విచిత్రంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ లో పారిశుధ్య పరిస్థితి ఇంకా కొన్నాళ్లు ఇలాగే ఉంటే జరిగే అనర్థం అంతా ఇంతా కాదు. సినిమా క్లైమాక్స్ లో బలాన్ని చూపే హీరోలా, పరిస్థితి పూర్తిగా క్షీణించిన తర్వాత ఎంట్రీ ఇచ్చి వరాలు కురిపించాలనేది ప్రభుత్వ ఆలోచన అయితే అంతకన్నా బాధాకరం మరొకటి లేదు. ప్రజల ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదు. గ్లోబల్ సిటీ తర్వాత. ముందు రోగాల సిటీ కాకుండా చూస్తే అదే పది వేలు.