నంద్యాల గడ్డపై భూమా, శిల్పా కుటుంబాల మద్య పొలిటికల్ వార్ మళ్లీ మొదలైంది. భూమా, శిల్పా కుటుంబాల మధ్య రాజకీయ వైరం మళ్లీ భగ్గుమంటోంది. తండ్రుల కాలం నుంచి ఉన్న రాజకీయ విబేధాలు ఇప్పుడు వారసులూ కొనసాగిస్తున్నారు. భూమా కుటుంబం తరపున రాజకీయం చేస్తున్న అఖిలప్రియ.. శిల్పా ఫ్యామిలీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రవిచంద్రారెడ్డి పరస్పర ఆరోపణలు , సవాళ్లు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఓ వైసీపీ కార్యకర్త హత్య. ఆక్టోబర్ తొమ్మిదో తేదిన నంద్యాల పొన్నాపురం కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు సుబ్బారాయుడుని కొంత మంది హత్య చేశారు. సంయమనం పాటించాల్సిన పోలీసులు రాజకీయ హత్య అని ప్రకటించేశారు. నిందితుడు టీడీపీ అని కూడా.. చెప్పుకొచ్చారు. నిజానికి ఆ హత్య గ్రామంలో గొడవల కారణంగా జరిగిందని.. నంద్యాలలో అందరికీ తెలుసు.
పోలీసులు రాజకీయ హత్య అని ప్రకటించగానే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తెర మీదకు వచ్చారు. భూమా కుటుంబం ప్రోద్భలంతోనే హత్య జరిగిందని ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపించేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నంద్యాల ఎమ్మెల్యే ఆరోపణలకు భూమా అఖిలప్రియ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. దమ్మూ, ధైర్యం ఉంటే నంద్యాల సుబ్బరాయుడి హత్యకు భూమా కుటుంబ సభ్యులే కారణమని వారం రోజుల్లో నిరూపించాలని సవాల్ చేశారు. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
భూమా కుటుంబం టార్గెట్గా కొంత కాలం నుంచి ఫ్యాక్షన్ ఆరోపణల్ని ప్రత్యర్థులు చేస్తున్నారు. భూమా కుటుంబానికి చాన్నాళ్లు నమ్మకస్తుడిగా ఉన్న సుబ్బారెడ్డి తనను హత్య చేయడానికి భూమా అఖిలప్రియ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పించారు. నిజానికి అలాంటిదేమైనా ఉంటే పోలీసులు వదిలి పెట్టేవారు కాదు. కానీ తనకు పోలీసులే చెప్పారంటూ ఆయన భూమా కుటుంబంపై రాజకీయ విమర్శలు చేశారు. ఆ తర్వాత ఏం జరిగినా.. భూమా కుటుంబానికి లింక్ పెట్టి.. అఖిలప్రియపై ఫ్యాక్షన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అఖిలప్రియ వాటిని గట్టిగానే ఎదుర్కొంటున్నారు. ఈ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని నంద్యాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.