ఆ పిడికిలి విప్లవానికి నాంది అన్నారు..!
ఉడికిపోయే ఆ రక్తం మార్పు తెస్తుందన్నారు..!
వీరావేశంతో పిడికిలి ఎత్తి చేసే ప్రసంగాలు మార్పుకు పునాది అన్నారు..!
ప్రజల కోసం ఎవడినైనా ప్రశ్నిస్తామన్నారు..!
కానీ ఇప్పుడేమయింది…? నాటి ఆవేశం మొత్తం చల్లారిపోయింది..! స్వంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. సమర్థించేంతటి దౌర్భాగ్య స్థితికి ఆత్మాభిమానం దిగజారిపోయింది..! ఓ నేతకు డప్పు కొట్టడానికి… సొంత రాష్ట్రానికి కీడు చేసేంతటి స్థాయికి పడిపోయింది…!. ఈ ఎత్తుపల్లాలన్నీ… జనసేనాని గురించే. ఆయన ఆవేశం గురించే. గతంలో ఆయన చేసిన పోరాటం.. అన్న మాటల గురించే.
పవన్ కల్యాణ్‌లో ఆ ఫైర్ ఎందుకు చల్లారింది..!
పవన్ కల్యాణ్ అంటే.. ఓ ఫైర్. ఆయన మాటల్లో చేగువేరా కనిపిస్తారు. ఎవర్నీ లెక్క చేయక.. ప్రజల కోసం పోరాడే ధీరుడు కనిపిస్తారు. ఒకప్పుడు… ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన పోరాటం ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. వంద శాతం నిధులు భరించి పోలవరం నిర్మిస్తామని ప్యాకేజీ ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్డూలని చెలరేగిన ఆయన ఆవేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. కేంద్రం ఏపీ ప్రజల్ని దగా చేస్తోందని.. అన్నప్పుడు.. అందరూ నిమేనని నమ్మారు. కానీ అప్పటితే పోలిస్తే.. ఇప్పుడు చేస్తున్న అన్యాయమే ఎక్కువే. చివరికి విభజిత ఏపీకి ఇస్తామన్న పోలవరం ప్రాజెక్ట్‌కు కూడా.. అడ్డుగోడేస్తున్నారు. దాన్ని శిధిలం చేయాలనుకుంటున్నారు. కానీ జనసేనాని నోరు మెదపలేకపోతున్నారు.
ధైర్యంగా రోడ్డెక్కలేని దుస్థితి జనసేనకెందుకు..?
పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ఉండవచ్చు కానీ.. గెలిచిన పార్టీకి.. ఓడిపోయిన పార్టీకి మధ్య తేడా జనసేననే. ఆ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి సమయంలో …. జనసేన ఏం చేయాలి..? ప్రజలకు మరింత అండగా ఉండాలి. కానీ ఏం చేస్తోంది. నమ్మకద్రోహం చేస్తోంది. అమరావతికి అండగా ఉంటామని.. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి… పవన్ కల్యాణ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా బీజేపీతో చేతులు కలిపి.. ఓ పోరాటాన్ని ప్రకటనలకు పరిమితం చేశారు. రైతుల్ని దారుణంగా వంచించారు. మూడు రాజధానులకే మద్దతు అని పవన్ చెబితే.. రైతులు నమ్మకం పెట్టుకునేవారు కాదు..కానీ అమరావతికే మద్దతని చెబుతూ.. వారి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నీడలో వైసీపీకి పార్టనర్‌గా మారిపోయినట్లు ఎందుకయ్యారు..?
పోలవరంపై జనసేన స్పందన చూసిన వారికి.. కేంద్రానికి ఇంత బానిసత్వం చేయాల్సిన అవసరం పవన్ కు ఏమొచ్చిందని అనుకున్నవారే ఎక్కువ. జగన్ కు అంటే కేసులున్నాయి కాబట్టి మాట్లాడలేరని అనుకుందాం… కానీ పవన్‌కు మోడీని మోయాల్సిన అవసరం ఏముంది..? సొంత రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్పందించాల్సి అవసరం ఏముంది..? ఒక్క పోలవరమే కాదు.. జనంసమస్యలను జనసేన పట్టించుకోవడం మానేసింది. అమరావతి రైతుల పోరాటం బేడీల వ్యవహారంతో కనీస స్పందన లేదు. స్థానిక ఎన్నికలపై నొప్పింపని.. తానొవ్వని స్పందన. గతంలో అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వాదించారు. ఇప్పుడు ఆ ఆవేశం కూడా చల్లారింది. బిజెపితో స్నేహం చేస్తున్న జనసేన.. ఎప్పుడు దేని మీద ఎలా రియాక్ట్ కావాలో తెలియక సతమతమవుతున్న వి,యం స్పష్టమవుతోంది. సొంత అభిప్రాయాలు చెప్పలేని దుస్థితికి ఆయనెళ్లిపోయారు.
జనసేన ఇంత ఆత్మాభిమానాన్ని ఎందుకు చంపుకుంటోంది..?
బీజేపీతో స్నేహం కోసం.. మోడీ గుడ్ లుక్స్ కోసం పవన్ కల్యాణ్ మొత్తంగా ఆత్మాభిమానాన్నే తాకట్టు పెడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తోంది. తాను చెప్పిన ఆదర్శాలకు.. చేసిన ప్రసంగాలకు.. ప్రజా సమస్యల పరిష్కారానికి.. వాటి కోసం పోరాటానికి ఆయన ఇప్పుడు వెనుకడుగు వేయడం… బీజేపీ భజనలో మునిగిపోవడం… జనసైనికులు కూడా సిగ్గుపడేలా చేస్తోంది. ఇప్పుడైనా పవన్ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. దేని కోసం ఈ రాజకీయం చేస్తున్నారు..?. రాజకీయ ఉద్ధానం ప్రజలు ఇవ్వాలి..మోడీ ఇవ్వరు. ఆ విషయం తెలుసుకుంటే.. పవన్ తన దారిని మార్చుకుంటారు. లేదు ప్రజల కన్నా మోడీనే ఇస్తారు అనుకుంటే.. పతనమే ఆయనకు ఎదురవుతుంది.