గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని పెట్టి..విశాఖకు రైల్వేజోన్ కేటాయించింది. కేంద్రంతో మాట్లాడి ఎట్టకేలకు విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటింప చేశారు. ఆ జోన్ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నా… మొత్తానికి ఏదో ఓ జోన్ వచ్చిందని సంతోషపడ్డారు. కానీ ఆ జోన్ పనులను మాత్రం కేంద్రం ఇంత వరకూ ప్రారంభించలేదు. ఎప్పుడుప్రారంభిస్తుందో కూడా తెలియదు. ప్రకటన మాత్రం చేసి వదిలి పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన పరిస్థితులే దీనికి కారణం అన్న చర్చ జరుగుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తే.. రైల్వే జోన్ కూడా అక్కడే ఎందుకని… విజయవాడకు మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
విజయవాడ రైల్వే జోన్ అంశం మొదటి నుంచి రాజకీయ పరంగా ఉంది. గతంలో ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో సైలెంటయ్యారు. విశాఖకు రైల్వేజోన్ ఉండాల్సిందేనని ఆయన అన్నారు. వాస్తవానికి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే.. దానికి విజయవాడను కేంద్రంగా చేస్తే అన్ని విధాలుగా కరెక్ట్‌గా ఉంటుందన్న అంచనా ఉంది. ప్రస్తుతం విశాఖ తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో ఉంది. విజయవాడ డివిజన్ పరిధి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి స్టేషన్ వరకు ఉంది. తడ వరకు విజయవాడ డివిజన్ సరిహద్దు ఉంది. ఈ కారణంగా రైల్వేజోన్ విజయవాడలో ఉంటే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. అతిపెద్ద జంక్షన్‌గా ఉన్న విజయవాడ కేంద్రంగానే నూతన జోన్ ఏర్పాటు చేయాలని మొదటి నుంచి డిమాండ్ చాలా కాలంగా ఉంది.
ఈ అంశంపై మెల్లగా రాజకీయ పార్టీల నేతలు వాయిస్ వినిపించడం ప్రారంభిస్తే.. అది రాజకీయ అంశం అయ్యే అవకాశం ఉంది. వైసీపీ పార్టీ విధానం కూడా వికేంద్రీకరణ కాబట్టి.. దీనికి అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నింటినీ విశాఖలో పెడితే ఇతర ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో.. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.