ముస్లిం యువకులు ఎవరైనా హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే.. వారి అంతిమ ప్రయాణం మొదలైనట్లేనని హెచ్చరిస్తున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కావాలంటే ఇందు కోసం త్వరలో చట్టం కూడా తీసుకొస్తానని ఆయన నేరుగానే చెబుతున్నారు. ముస్లిం యువకులు ఎవరైనా హిందూ మహిళల్ని పెళ్లి చేసుకుంటే… దాన్ని బీజేపీ నేతలు లవ్ జీహాద్‌గా పేర్కొంటున్నారు. ఉద్దేశపూర్వకంగా హిందూ మహిళల మతం మారుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటీవల ఓ జంట.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. వేర్వేరు మతాలకు చెందిన తమను.. తమ పెద్దలు మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే.. మతం గురించి తెలియకుండా, నమ్మకం లేకుండా కేవలం పెళ్లి కోసం మార్చుకోవడం సరికాదని అభిప్రాయపడుతూ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ క్రమంలో లవ్ జీహాద్ అంశం ఒక్క సారిగా చర్చనీయాంశం అయింది. లవ్ జీహాద్‌ను నేరంగాపరిగణిస్తూ చట్టం తీసుకు రావాలని హిందూత్వ సంస్థలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఇలాంటి విషయంలో యోగి ఆదిత్యనాత్.. ఒకటికి పది చేస్తారు కాబట్టి.. ఆయన మరింత దూకుడుగా నిర్ణయాలు ప్రకటించారు. త్వరలో లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టం చేస్తానని ప్రకటించారు. అంతే కాదు మా మహిళల్ని వలలో వేసుకుని కించపరిచేందుకు యత్నిస్తున్నారో వారిని హెచ్చరిస్తున్నాను.
మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ ఆఖరి ప్రయాణం ప్రారంభమవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి నోటి వెంట.. ఓ వర్గ ప్రతినిధిగా.. వ్యాఖ్యలు రావడం.. అదీ కూడా… మనుషుల్ని చంపుతామన్నట్లుగా వ్యాఖ్యలు ఉండటం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో కేరళలోనూ లవ్ జీహాద్ అంశం కలకలం రేపింది.