తెలంగాణ సీఎం కేసీఆర్ .. తన దృష్టిలో పడిన వారికి.. వరాలివ్వడంలో చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరిస్తారు. అది మనుషులకే కాదు.. ఊళ్లకు.. నియోజకవర్గాలకు కూడా. తెలంగాణకు చెందిన వారు ఏదైనా ఘనత సాధిస్తే భూరి సాయం ప్రకటిస్తారు. ఊళ్లకూ అంతే. గతంలో ఎర్రవెల్లి వంటి గ్రామాలకు .. ఇంటికి రూ. యాభై వేల వరకూ ప్రకటించడమే కాదు.. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించినందున ఆ నియోజకవర్గానికి వేల కోట్ల వరాలు ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో వాసాల మర్రి అనే గ్రామం చేరింది. ఆ గ్రామానికి రూ. వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.
వాసాలమర్రి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లో ఉంటుంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. అలా వెళ్తూ.. అ గ్రామంలో ఆగారు కేసీఆర్. కానీ ఆ గ్రామంలో అభివృద్ధి పనులు ఆయనను సంతృప్తి పర్చలేదు. వెంటనే సర్పంచ్‌ను.. ఫాంహౌస్‌కు వచ్చ ికలవాలని ఆదేశించారు. దీంతో సర్పంచ్.. మిగతా ప్రతినిధుల్ని తీసుకుని.. ఫాంహౌస్‌కు వెళ్లి కలిశారు. అందరూ కలిసి తమ గ్రామానికి కావాల్సిన పనులేమిటో రాసి వినతి పత్రం ఇవ్వబోయారు. అయితే.. కేసీఆర్ అవసరం లేదని.. రూ.100 కోట్లు ప్రకటించేశారు.
కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు తీసుకెళ్లి చూపించాలన్నారు. 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. అయితే కేసీఆర్ ఇలా ప్రకటిస్తారు కానీ నిధులు ఇవ్వరన్న విమర్శలను విపక్షాలు చేస్తూంటాయి. కొన్నాళ్ల తర్వాత వాసాలమర్రిని చూస్తే..కేసఆర్ హామీ నిజమో.. ప్రతిపక్షాల మాటలు నిజమో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.