హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఆదాయాన్ని తెలంగాణ ఆర్టీసీకి సగం ధారదత్తం చేసిన తర్వాత బస్సులు తిప్పుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోగలిగింది ఏపీ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో 826 బస్సులను టీఎస్ ఆర్టీసీ తిప్పుతుంది. ఇందులో అత్యధికం విజయవాడ రూట్లోనే తిరుగుతాయి. గతంలో.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లో తొంభై శాతం ఏపీ ఆర్టీసీ బస్సులే ఉండేవి. ఇప్పుడు… సగానికన్నా ఎక్కువగానే తెలంగాణ బస్సులు ఉండనున్నాయి. తెలంగాణలో ఏపీ ఆర్టీసీ 638 బస్సులను తిప్పుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ తో పాటు కర్నూలు టు హైదరాబాద్ రూట్లోనూ ఈ బస్సులు నడుస్తాయి.
నిజానికి ఆర్టీసీ విభజన అధికారికంగా పూర్తి కాలేదు. అందుకే.. లాక్ డౌన్ వరకూ ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిపారు. అనుమతులు ఉండాలనే సమస్య రాలేదు. కానీ.. లాక్ డౌన్ తర్వాత ఒప్పందం చేసుకోవాల్సిదేనని తెలంగాణ పట్టుబట్టింది . దాంతో అన్ లాక్ చేసినా.. ప్రైవేటు బస్సులు పరుగులు పెడుతున్నా.. ఆర్టీసీ బస్సులు మాత్రం తిరగడం లేదు. పండగ సీజన్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రతిష్టంభన ఇలా కొనసాగిస్తే ప్రైవేటు బస్సులకే మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమయింది.
చివరికి ఏపీ ప్రజలకే ఎక్కువగా బస్సు సర్వీసుల అవసరం కాబట్టి.. ప్రభ్వత్వమే దిగి వచ్చింది. తెలంగాణ, ఏపీ మధ్య బస్సు సర్వీసులు వెంటనే ప్రారంభమవుతాయి. సామాన్యులకు మాత్రం ఇది గుడ్ న్యూసే. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని తట్టుకోలేకపోతున్న వారికి .. ఊరట ఇస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి మాత్రం..ఇది చేదు గుళికే. లాక్ డౌన్ కారణంగా.. వందల కోట్ల నష్టాన్ని భరించిన ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం ఇచ్చే రూట్లో సర్వీసులు గండిపడటం ఇబ్బందికరమే.