వరద బాధితులకు సాయం చేయడానికి ఉదారంగా విరాళాలివ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు.. కొన్ని రాష్ట్రాలతో పాటు కొంత మంది పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు స్పందించి విరాళాలిచ్చారు. కొంత మంది నుంచి ప్రభుత్వమే తీసుకుంటోంది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఒక్క రోజు వేతనం విరాళం తీసుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు చూసి.. ఉద్యోగ సంఘాలు షాకయ్యాయి. అనుమతి లేకుండా ఎలా తీసుకుంటారని.. ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఉద్యోగుల వద్ద నుంచే తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రధాన ఉద్యోగ సంఘాలు నోరు మెదపలేని స్థితిలో ఉన్నాయి. దీంతో చిన్నా చితకా ఉద్యోగసంఘాల ద్వారా తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక్క రోజు జీతం సీఎంఆర్ఎఫ్కు జమ చేశారు.
హైదరాబాద్లో వరద బాధితుల కోసం ప్రభుత్వం రూ. 550 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంత మొత్తంలో నిధులు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో ప్రభుత్వం కొంత కేటాయించి.. కొంత విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగుల ఒక్క రోజు జీతం విరాళం ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేసినప్పుడు ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. అప్పుడే … కేసీఆర్ వారికి డీఏ ప్రకటించి.. దసరా తర్వాతి రోజు సెలవుగా ఇచ్చి.. కూల్ చేశారు. ఇప్పుడు.. జీతం కట్ చేసే సరికి మళ్లీ ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రారంభమయింది.
కరోనా కారణంగా ఉద్యోగుల జీతాల్లో మూడు నెలల పాటు ప్రభుత్వం కోత పెట్టింది. ఆ జీతాన్ని వాయిదాల్లో ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు.. అలా వాయిదాల్లో వచ్చే సొమ్మును.. విరాళం పేరుతో మళ్లీ ప్రభుత్వమే తీసుకుంటోందన్న అసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితికి ఉద్యోగ సంఘాలు వెళ్లాయి. మొదట్లోనే వ్యతిరేకించి ఉంటే.. ప్రభుత్వం వెనక్కి తగ్గేదమో కానీ.. అంతా అయిపోయిన తర్వాత నోరు పెద్దది చేసుకున్నా.. ప్రయోజనం ఉండదు.