దుబ్బాక ఉపఎన్నిక ఇప్పుడు .. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో ఎలాంటి ఉపఎన్నికలు జరిగినా..టీఆర్ఎస్కు ఏకపక్ష విజయమే లభించింది. ప్రతిపక్ష సిట్టింగ్ శాసససభ్యుడు చనిపోయిన చోట కూడా.. టీఆర్ఎస్ .. కనీసం యాభై వేల మెజార్టీని సాధించింది. అలాంటింది.. ఇప్పుడు దుబ్బాకలో.. తన సొంత సిట్టింగ్ సభ్యుడు చనిపోతే… గెలిపించుకోవడానికి గులాబీ దళం చెమటలు కక్కుతోంది. మామూలుగా ఎవరైనా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే… ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపే సంప్రదాయం గతంలో ఉండేది. కానీ కేసీఆర్ దాన్ని మార్చేశారు. ఖేడ్, పాలేర్ వంటిచోట్ల.. పోటీ చేసి గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు విపక్షాలు కూడా.. పోటీ చేయడానికి సై అన్నాయి. దుబ్బాకలో ప్రస్తుతం శాసనసభ్యుడి మరణం వల్ల వచ్చిన ఉపఎన్నికలా కాకుండా… జనరల్ ఎలక్షన్ స్థాయిలో హీట్ పెరిగింది. ఇప్పుడు చనిపోయిన రామలింగారెడ్డి గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు. ఎవరు గెలిస్తే ఏమవుతుందన్నదానిపైనే చర్చించుకుటున్నారు.
దుబ్బాక టీఆర్ఎస్ కంచుకోట. అందులో ఎలాంటి సందేహం లేదు. సిద్దిపేట పక్కనే ఉండటం.. తెలంగాణ సెంటిమెంట్ గుండెల నిండా నింపుకుని ఉన్న మెదక్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం కావడంతో ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి.. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డికే ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. అంతకు ముందు అక్కడ టీడీపీలో ఉండే చెరుకు ముత్యం రెడ్డి ప్రభావవంతమైన నేత. సాధారణ రైతు అయిన ఆయన అభివృద్ధి ఎజెండాగా రాజకీయాలు చేసేవారు. ఉద్యమంతో ఆయన వెనుకబడిపోయారు. తర్వాత కాంగ్రెస్..ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆయన కుమారుడు మళ్లీ కాంగ్రెస్లో చేరారు. అయితే ఇప్పు.. తెలంగాణ రావడంతో… సెంటిమెంట్ ఎక్కడా వర్కవుట్ కావడం లేదు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ప్రచారాంశంగా మారింది.
తెలంగాణ ప్రధానంశంగా ఉన్నప్పుడు.. టీఆర్ఎస్కు తిరుగు ఉండేది కాదు. ఇప్పుడు అభివృద్ధి తెరమీదకు రావడంతో.. టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే హరీష్ రావు… రైతుల సమస్యలను ఎత్తి చూపుతున్నారు. మీటర్ల గురించి.. రైతు చట్టాల గురించి చెబుతున్నారు. కానీ అవి అంతగా ప్రజల్లోకి వెళ్లినట్లుగా లేవు. బీజేపీని కట్టడి చేయాలన్న వ్యూహం వికటించి.. ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా నిలిపేదాకా తీసుకెళ్లిందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవకపోయినా.. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచినా.. ఫలితం తేడావచ్చినా… అవి టీఆర్ఎస్కు ప్రమాద ఘంటికలుగానే మారతాయనడంలో సందేహం లేదు. అందుకే.. దుబ్బాక ఎన్నిక ఫలితం రాజకీయాల్లో మార్పు తెస్తుందని అంచనా వేస్తున్నారు.