ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ కు ప్రమోషన్స్ చేస్తున్న సెలబ్రిటీలకు షాక్ తగిలే రోజులు దగ్గర్లోనే కనిపిస్తున్నాయి. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలు కోహ్లీ, గంగూలీ, రానా, సుదీప్, ప్రకాష్‌రాజ్, తమన్నాకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని.. వాటిని ఆడమని ప్రోత్సహించే వారిదే తప్పంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దానిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టులో ప్రకటనల్లో నటించిన ప్రముఖులకు నోటీసులు పంపింది.
నిన్నామొన్నటి వరకూ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్ రావడంతో చాలా మంది అమాయకులు ఆ గ్యాంబ్లింగ్ మాయలో పడిపోయారు. లక్షలకు లక్షలు నష్టపోయారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం విధించాయి. అయితే కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి.
మొత్తం 132 వెబ్సైట్లు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలన్న మడిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఆ వెబ్సైట్లు జూదాన్ని ప్రోత్సహిస్తున్నాయని చూసుకోకుండా సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ఓ ఎండార్స్మెంట్గానే చూడటంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ.. సెలబ్రిటీలు .. ఇలాంటి ప్రకటనల్లో నటించి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈ గ్యాంబ్లింగ్ ప్రకటనలు వారికి ఎలాంటి చిక్కులు తెచ్చి పెడతాయో చూడాలి..!