ఈనెల 24వ తేదీన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో ఓదార్పు యాత్ర చేయబోతున్నారు. ఇంతకు ముందు ఆయన తెలంగాణాలో ఓదార్పు యాత్ర చేసారు. అది రాజకీయ యాత్ర కాదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన యాత్ర ముగింపు సభలో రాజకీయ ప్రసంగం చేసారు. కానీ ఆయన చేసిన ఆ యాత్ర వలన టీ-కాంగ్రెస్ కి ఏమయినా ప్రయోజనం కలిగిందా? ఆయన పర్యటించిన ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ ఏమయినా బలపడిందా అంటే లేదనే చెప్పాలి. ఆయన పర్యటించి వెళ్లిపోయిన తరువాత మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. మరి రాహుల్ చేసిన యాత్ర వలన పార్టీకి ఏమి ఒరిగింది? అంటే ఏమీ లేదనే చెప్పవచ్చును.
తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికీ ఆయన పర్యటన వలన అక్కడ ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగలేదు. ఇక తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్న రాష్ట్ర ప్రజలను ఆయన ఏవిధంగా మెప్పించగలరు? ఆయన పర్యటన వలన మానుతున్న వారి గాయాన్ని మళ్ళీ కెలికి దానిపై కారం చెల్లినట్లవుతుంది.ఈ సంగతి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకి తెలియదనుకోలేము. కానీ వారు ఆయనకి ఈ పరిస్థితి వివరించి చెప్పి ఆయన యాత్రను ఆపే ప్రయత్నం చేయకుండా దాని గురించి అప్పుడే గొప్పగా చెప్పుకొంటున్నారు. దాని వలన ప్రజలకు మరింత ఆగ్రహం కలగవచ్చును.
కాలికి ముల్లు గుచ్చుకొంటే చేతికి కట్టు కడితే ఎలా ఉంటుందో ఆయన ఓదార్పు యాత్రలు చేయడం అలాగే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ క్రమంగా ఖాళీ అయిపోతున్నా కూడా పట్టించుకోని ఆయన ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా ప్రయోజనం ఉండదనే సంగతి తెలుసుకోలేని వాడు ఇక పార్టీని ఏవిధంగా నడిపిస్తాడు? ఆయనకి రెండు రాష్ట్రాలలో పార్టీని బ్రతికించుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే తను రాకుండా పార్టీలో ఉన్న అతిరధ మహారధులనదగ్గ సీనియర్ నేతలను రెండు రాష్ట్రాలకి పంపించి పార్టీ పరిస్థితి చక్కదిద్దే వరకు అక్కడే ఉండమని ఆదేశించి ఉంటే దానివలన ఏమయినా ఫలితం ఉండేదేమో. కానీ ఆయన పనిగట్టుకొని రాష్ట్రానికి వచ్చి జీవచ్చంలా మిగిలున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాణం కూడా తీసిపోతారేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆయన ఇదివరకు తెలంగాణాలో పర్యటిస్తారని తెలిసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ “గాంధీలు వస్తుంటారు పోతుంటారు వారిని పట్టించుకొనవసరం లేదు,” అని అనడం చూస్తే రాహుల్ గాంధీ పర్యటన వలన తెరాసపైనే కాదు కనీసం కాంగ్రెస్ పార్టీపై కూడా ఎటువంటి ప్రభావం చూపబోదు అని చెప్పినట్లుంది. ఆయన చెప్పినట్లే రాహుల్ గాంధీ తన యాత్ర ముగించుకొని డిల్లీ వెళ్లి పోగానే డీ.శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. కనుక ఆయన యాత్ర చేస్తే పార్టీ బలపడటం మాట అటుంచి కాంగ్రెస్ పార్టీ కాళీ అయిపోకుండా ఉంటే అదే పదివేలనుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఆయన రాకని తెదేపా నేతలు విమర్శించే బదులు స్వాగతిస్తే మంచిదేమో?