స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఏర్పడిన ఘర్షణ పూరిత వాతావరణం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళ్లే ప్రమాదం కనిపిస్తూండటంతో… గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండు వర్గాలను పిలిచి ఆయన మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. ముందుగా ఎస్ఈసీ రమేష్ కుమార్ గవర్నర్‌ను కలిశారు. రాజ్‌భవన్ నుంచి వచ్చిన పిలుపు మేరకే ఆయన వెళ్లి కలిసినట్లుగా చెబుతున్నారు. అక్కడ జరిగిన చర్చల సారాంశం ఏమిటో స్పష్టత లేదు కానీ.. మొత్తం వివాదంపై.. వివరణ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాగే… మొత్తం పరిణామాల విషయంలో… ఓ నివేదికను కూడా సమర్పించినట్లుగా చెబుతున్నారు. దాదాపుగా అరగంట సేపు… నిమ్మగడ్డతో గవర్నర్ మాట్లాడారు.
ప్రభుత్వ వర్గాలు కూడా.. గవర్నర్‌ను కలవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే… గవర్నర్‌ను కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఆయన కలవకపోతే.. ఓ బృందం అయినా కలుస్తుందని… ఈ విషయం సీక్రెట్‌గా ఉంచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎస్ఈసీతో మాట్లాడిన అంశాలను బట్టి.. ప్రభుత్వంతో మాట్లాడి.. విషయాన్ని చక్క బెట్టాలన్న ఆలోచనలో బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. యాధృచ్చికంగానో… మరో కారణమో కానీ.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ… విజయవాడ పర్యటనకు వచ్చారు. ఆయనను జగన్.. మర్యాదపూర్వకంగా కలిశారు. వారి మధ్య ఏం చర్చలు జరిగాయో స్పష్టత లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో వివాదం.. సరికొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉండటంతో.. కేంద్రం నుంచి గవర్నర్‌కు కూడా కొన్ని సూచనలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం వివాదం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఉంది. సెటిల్డ్ లాకు వ్యతిరేకంగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని.. ఎస్ఈసీ అప్పీల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ తర్వాత మొత్తంగా… వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.