దేశంలో రాజకీయ అంశంగా మారిన రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాల రద్దు అంశంలో.. తాత్కలిక పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది. ఉన్నపళంగా ఆ చట్టాల అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసి.. తదుపరి చర్యల కోసం నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్ధిక వేత్తలతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుందని తమకు నివేదిక సమర్పిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాగే.. చట్టాల నిలిపివేత, కమిటీని నియమించే అధికారం అంశంపై సందేహాలు రావడంతో.. దానిపైనా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కమిటీని నియమించే అధికారం .. చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకు ముందు.. ఈ చట్టాలపై వాదోవవాదాలు జోరుగా సాగాయి. రైతుల ఆందోళనల్లో ఖలిస్తాన్ వేర్పాటు వాదులు చేశారని.. కేంద్రం తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించడంతో.. నిఘావర్గాల రికార్డులు సమర్పిస్తామని తెలిపారు. రైతు చట్టాలు పార్లమెంట్లో పాసైపోయాయి. రాష్ట్రపతి కూడా సంతకం చేశారు.
అయితే.. పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరాదికి చెందిన రైతులు వీటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అవి తీవ్ర ఆందోళనలకు దారి తీశాయి. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే ఉన్నారు. చట్టాల రద్దు అయిన తర్వాతనే వెనక్కి వెళ్తామని వారు శపథం చేశారు. ఎనిమిది విడతలగా చర్చల ుజరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గుతారో లేకపోతే కేంద్రం రద్దు చేసేవరకూ వెనక్కి తగ్గబోమంటారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే.. కమిటీకి తాము వ్యతిరేకమని వారు చెబుతున్నారు.