తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ హడావుడి ప్రారంభమైంది. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ పంపిణీ చేస్తోంది. కేంద్రం ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు మంజూరు చేయడమే కాదు.. పెద్ద ఎత్తున కొనుగోలు చేసి.. దేశవ్యాప్తంగా పదహారో తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకూ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ప్రస్తుతం తెలంగాణకు 3 లక్షల 72 వేల వ్యాక్సిన్ డోసులు తరలించారు. మొత్తంగా 1,211 సెంటర్లలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రస్తుతం కోఠిలోని ఇమ్యునైజేషన్ భవనానికి వ్యాక్సిను తరలించారు.
అక్కడ్నుంచి వ్యాక్సిన్ కేంద్రాలకు పదిహేనున తరలిస్తారు. ఏపీలోనూ ఈనెల 16న కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలివిడతగా రాష్ట్రానికి చేరుకున్న 4.7 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను విజయవాడకు పంపారు. ప్రభుత్వం వాటిని హ్యాండోవర్ చేసుకుని గన్నవరంలో శీతలీకరణ కేంద్రంలో అధికారులు భద్ర పరిచారు. రేపే అన్ని జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ పంపిణీని పండగలా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ముందుగా… ఆరోగ్య సిబ్బందికి మాత్రమే.. టీకా వేస్తున్నప్పటికీ.. తర్వాత కరోనా వారియర్స్‌కి.. ఆ తర్వాత వృద్ధులకు వేస్తారు. అందుకే.. సంక్రాంతి స్పెషల్ గా .. ఈ వ్యాక్సిన్ వేడుకల్ని జరపాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రులు కూడా.. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తాయని.. ప్రజాప్రతినిధులు యాక్టివ్‌గా ఉంటేనే అధికారులు అలసత్వం వహించరు…కేసీఆర్ చెబుతున్నారు. ఏపీలో మాత్రం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలన్న సూచనలు సర్కార్ వైపు నుంచి వెళ్లలేదు. అధికారులే.. పకడ్బందీగా నిర్వహించనున్నారు.