తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ.. ఆ పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలు కూడబలుక్కుని పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. పాస్టర్ల పేరుతో క్రిస్టియన్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నారని..బలవంతపు మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ అధినేత చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సైలెంట్‌గానే ఉన్న నేతలు.. ఇప్పుడు అందరూ… కలిసి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులందరూ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. గత వారం మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ అనే నేత కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత క్రిస్టియన్ నేతలందరూ అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరిగింది.
టీడీపీ హయాంలో పలు రకాల నామినేటెడ్ పోస్టులు పొందిన వారు కూడా.. అసంతృప్తిగా ఉన్నారని వారు కూడా పార్టీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. అయితే.. వీరందరూ వెళ్లిపోవాలన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారశైలి ఉంది. తాము పార్టీ నుంచి వెళ్లిపోతామంటే.. ఒక్కరు కూడా స్పందించడం లేదని కొంత మంది నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే.. టీడీపీ కూడా ఈ విషయంలో కావాలనే వారందరూ బయటకు పోవాలన్నట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు. కన్వర్టడ్ క్రిస్టియన్స్ ఎప్పుడూ.. టీడీపీకి ఓటు బ్యాంక్‌గా లేదని.. కానీ వారిని ఎప్పుడూ టీడీపీ దూరం పెట్టలేదని.. గౌరవంగా చూసినా… ఇప్పుడు చాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారని అంటున్నారు.
అదే సమయంలో… ప్రస్తుతం సమాజంలో ఏర్పడిన పరిస్థితుల్లో.. ఆ వర్గం అంతా.. ఒక పార్టీదే అన్న ప్రచారం జరుగుతోంది. ఆ ముద్ర మరింత బలంగా ఉండాలంటే.. టీడీపీలో వారు ఉండకపోతే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తానికి .. ఏపీలో రాజకీయాల మతాల ప్రకారం.. వర్గీకరణ జరుగుతున్నాయి. కొన్ని పార్టీలపై మత ముద్ర వేయడం.. వేయించుకోవడం కోసం వ్యూహాలు పన్నుతున్నాయి.