పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అర్జంట్‌గా విచారణ జరపాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. విచారణను పద్దెనిమిదో తేదీ వరకూ వాయిదా వేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు పదిహేడో తేదీ వరకు ఉన్నాయి. పద్దెనిమిదో తేదీన రెగ్యులర్ బెంచ్ మీదే విచారణ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. మధ్యాహ్నం ప్రారంభమైన విచారణలో ఎస్ఈసీ తరపు న్యాయవాది దాదాపుగా గంట సేపు వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రద్దు చేయడం ఇంతవరకూ జరగలేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కు, పోలింగ్ కు సంబంధం లేదని కూడా న్యాయవాది వివరించారు.
విచారణను 18వ తేదీకి వాయిదా వేసిన సందర్భంలో… అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. అంత అవసరం లేదని రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఈ నెల 23న మొదటి దశ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా… స్టే వల్ల ఎన్నికల ప్రక్రియ జాప్యం అవుతుందని తెలిపింది. ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అని అడుగుతూ.. ఎన్నికల కమిషన్‌కి ఇప్పటికే 4 వేల మెయిల్స్ వచ్చాయని కోర్టు దృష్టికి ఎస్ఈసీ తరపు న్యాయవాది తీసుకెళ్లారు. అయితే ఈనెల 18న రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని ధర్మాసనం వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా.. ఎన్నికల ప్రక్రియ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. ఎలాక్ట్రోరల్ రోల్స్ అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను సస్పెండ్ చేయడంతో కోడ్ ఉంటుందా లేదా.. అన్న సస్పెన్స్ ఏర్పడింది. అయితే కోడ్ ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది అంగీకరించడంతో ఉత్కంఠ ప్రారంభమయింది.