ప్రతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకోవడం.. తీరిగ్గా.. అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగిందో.. లేకపోతే సీన్ వేరేలా ఉండేదని అనుకోవడం.. కాంగ్రెస్ పార్టీకి కామన్‌గా మారింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ అదే జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రెండింటికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో.. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారంలోకి దిగిపోయాయి. కానీ కాంగ్రెస్ మాత్రం కసరత్తు ప్రారంభించి.. నాన్చుడు స్టార్ట్ చేసింది. అక్కడ కూడా… చాలా మంది కాంగ్రెస్ నేతలు.. తాము రేసులో ఉన్నామంటూ… ఒత్తిడి ప్రారంభించారు. దీంతో ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా… తమ వర్గాలను కాపాడుకుంటూ… లోకల్ లీడర్లు ఉత్తుత్తి కసరత్తు ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ…మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థుల షయంలో ఓ నిర్ణయం తీసుకుని ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. వరంగల్ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి కే మరో మారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రచార వేగాన్ని పెంచారు. మహబూబ్ నగర్ స్థానంలో మేయర్ బొంతు రాంమోహన్ ను ఫైనల్ చేశారు. ఇక బీజేపీ సైతం రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు కేండేట్లను ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ రామచందర్ రావు కు మళ్ళీ పోటీచేసే ఛాన్స్ ఇచ్చింది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ కు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దాంతో వారంతా ఇప్పటికే జిల్లాల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. కాంగ్రెస్ మాత్రం మొదట పోటీ చేయాలా వద్దా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు అభ్యర్థుల్ని ఖరారు చేద్దాం అనే స్థితికి వచ్చింది.
ఇప్పటికి ముఖ్యనేతల ఆలోచనల ఆధారంగా మూడు నుంచి నాలుగు పేర్లతో ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారు. వాటిని హైకమాండ్‌కు పంపుతారు. మళ్లీ వాటిపై చర్చ జరుగుతోంది. మాకివ్వకపోయినా పర్వాలేదు.. వేరేవారికి ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు వెళ్తాయి. హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. చివరికి ఎవరికి పలుకుబడి ఎక్కువ ఉంటే వాళ్లు టిక్కెట్ తెచ్చుకుని నామినేషన్ వేస్తారు. కానీ.. వారికి ప్రజల్లో పలుకుబడి ఉండదు. దాంతో.. పరువు పోతుంది. అయినా ఈ ప్రాసెస్‌కు.. కాంగ్రెస్ చెక్ పెట్టడం లేదు. తమదారి తమదే అని.. ముందుకు పోతోంది.