సుకుమార్ ప్రేమకథలు తీయడంలో దిట్ట. ఆర్యలో ఓ కొత్త తరహా ప్రేమ కథని చూపించాడు. ఇప్పుడు తన శిష్యుడు బుచ్చి కూడా… తన తొలిసినిమాగా ప్రేమకథే ఎంచుకున్నాడు. అదే… `ఉప్పెన`. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ.. అన్నీ సుకుమారే. తన పేరు ఈ సినిమా పోస్టర్ పై ఉండడం, మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా కావడం, విజయ్ సేతుపతిని విలన్ గా చేయడం.. తదితర అంశాలతో ఈ సినిమాపై ఫోకస్ గట్టిగానే పడింది.
ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా.. టీజర్ విడుదల చేశారు. ఇందులో ప్రేమనంతా ధారబోశాడు దర్శకుడు. హీరోయిన్ ని చాటు నుంచి చూస్తూ ప్రేమించే హీరో, తనకీ, అబ్బాయికీ మధ్య ప్రేమ కూడా అడ్డే అనుకునే హీరోయిన్… వీళ్ల ప్రేమ కథ ఇది.
ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది.. కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది
ఓ పాటి చూసేశామనో అవునో కాదో తేల్చేల్తది..
అవునంటాదేమో చెప్పలేం.. కాదంటే మళ్లీ చూడలేం.
అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నా
ఈ ఒక్కరాత్రీ ఎనభై సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం వాసూ
ఇలా… మంచి డైలాగులే వేసుకున్నారు టీజర్లో. విజువల్స్, దేవి ఇచ్చిన ఆర్.ఆర్.. ఇవన్నీ హాయిగా ఉన్నాయి. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తొలి సినిమా విడుదల అవ్వకుండానే చాలా ఆఫర్లు అందుకుంది కృతి. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అనిచాలామంది ఎదురు చూస్తున్నారు. నిజంగానే కృతి క్యూట్ గా కనిపిస్తోంది. ఈసినిమాకి తనే ప్రధాన ఆకర్షణ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతిని మాత్రం టీజర్ లో దాచేశారు. తనెప్పుడు కనిపిస్తాడో చూడాలి.