మాకు కొత్త కథలు మాత్రమే కావాలి.. అని ఏ ప్రేక్షకుడూ… థియేటర్ల ముందు ధర్నాలు చేయడు.
రొటీన్ కథలు తీసినా చూస్తాం.. అని హామీ కూడా ఇవ్వడు.
కథ ఎలాంటిదైనా – రెండు గంటలు ఎంటర్ టైన్మెంట్ ఇస్తామన్న భరోసా చాలు.ఏం చెప్పాం? అన్నది కాదు. ఎలా చెప్పాం? అన్నదే ఇక్కడ పాయింట్.
కొన్నిసార్లు రొడ్డకొట్టుడు ఫార్ములా కథలు హిట్టయిపోతూ ఉంటాయి. అలాగని అదే ఫార్ములాని ప్రతీసారీ నమ్ముకుంటే.. తలబొప్పి కడుతుంటుంది. సంతోష్ శ్రీనివాస్ గత సినిమాలన్నీ రొటీన్ ఫార్ములాలోనే సాగాయి. వాటితో మిశ్రమ ఫలితాలూ వచ్చాయి. అంటే.. ప్రతీసారీ రొటీన్ ఫార్ములా సేఫ్ జర్నీ కాదు.. అన్న విషయం సంతోష్ శ్రీన్వాస్ కి గతంలోనే అర్థమైందన్నమాట. ఏం ఉంటే జనం చూస్తారో. అన్న సంగతీ తెలిసే ఉంటుంది. అయినా సరే… మళ్లీ ఓ రొటీన్ కథనే ఎంచుకున్నాడు. అదే… `అల్లుడు అదుర్స్`. మరి ఈసారి.. ఎలాంటి ఫలితం వచ్చింది? శ్రీను.. శ్రీనుతో చేసిన హంగామా వర్కవుట్ అయ్యిందా?
శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ది సెపరేట్ క్యారెక్టరైజేషన్. ఓ పట్టాన. ఓ నిర్ణయానికి లొంగి ఉండడు. చిన్నప్పుడే వసుంధర (అను ఇమ్మానియేల్)ని ఇష్టపడతాడు. అయితే వసుంధర – శ్రీను.. కొన్ని అనికోని పరిస్థితుల వల్ల విడిపోవాల్సివస్తుంది. దాంతో.. ప్రేమపై పగ, ద్వేషాలూ పెంచేసుకుంటాడు. కానీ.. పెరిగి పెద్దయ్యాక… కౌముది (నభా నటేషా)ని తొలి చూపులోనే ప్రేమించి, తన ప్రేమని ఎలాగైనా గెలుచుకుంటానని, పది రోజుల్లో ఐ లవ్ యూ.. చెప్పించుకుంటానని కౌముది తండ్రి (ప్రకాష్‌రాజ్)తో ఛాలెంజ్ విసురుతాడు. మరి పది రోజుల్లో కౌముది ప్రేమని… శ్రీను గెలుచుకున్నాడా? ఈ కథలో గజ (సోనూసూద్) పాత్రేమిటి? అన్నదే మిగిలిన కథాంశం.
`కొత్త కథలకే మా ఓటు..` అని హీరోలు మైకులు పట్టుకుని స్పీచులు వల్లించేస్తుంటారు. అయితే అదేంటో తెలీదు… చాలాసార్లు రొటీన్ కథలకే పడిపోతుంటారు. `అసలు ఈ కథని హీరో గానీ, నిర్మాత గానీ ఎలా ఒప్పుకున్నారు చెప్మా..?` అని సినిమా చూస్తున్నంతసేపూ.. ముక్కున వేలేసుకోవడమే ప్రేక్షకుడి పని అవుతుంది. అదంతా పాత కథని జిమ్మిక్కులతో చెప్పిన దర్శకుడి పనితనమా? లేదంటే… పాత కథకు ఫ్లాటైపోయే నిర్మాత అమాయకత్వమా? లేదంటే ఇంతకంటే గొప్ప కథలు లేని పరిశ్రమ వైఫల్యమా? అన్నది అర్థం కాదు. `అల్లుడు అదుర్స్` తొలి పది నిమిషాలు చూస్తే చాలు.. పది పాత సినిమాలు కళ్ల ముందు కదలాడతాయి. అలాంటిది రెండు గంటల `అల్లుడు`ని భరించుకుంటూ చూస్తే.. సవాలక్ష పాత సినిమాలు గుర్తొచ్చేస్తాయి. అంతెందుకు? `కందిరీగ` కథ కూడా ఇలానే ఉంటుంది. ఆమాటకొస్తే.. `కందిరీగ`కు రెండో వెర్షన్ స్క్రిప్టు అన్నా – పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
హీరో క్యారెక్టరైజేషన్ ని ఎనలైజ్ చేస్తూ ఓ ఇంట్రడక్షన్ పాట, తనకో సిల్లీ ఫ్లాష్ బ్యాక్, ఓ లవ్‌స్టోరీ, పాట.. టీజింగు – ఫైటూ.. ఇలా అదికాస్త, ఇది కాస్త పేర్చుకుంటూ వెళ్లిన.. మరో ఫక్తు సినిమాలా.. అల్లుడు అదుర్స్ కనిపిస్తుంటుంది. టైటిల్‌కి జస్టిఫికేషన్ చేయడానికైనా ఇందులో `అదుర్స్` అనిపించే సీను ఒక్కటైనా చొప్పించాలని దర్శకుడు, రచయితలు చేసిన విశ్వ ప్రయత్నాలకు అంతు ఉండదు. కాకపోతే… ప్రేక్షకుడు బెదిరిపోయి.. థియేటర్ తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయడానికి తప్ప ఆ సన్నివేశాలెందుకూ అక్కరకు రాలేదు.
విలన్లను బకరా చేసుకుని, హీరో… ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం ఓ దశ వరకూ జనం చూశారు. ఆదరించారు. కానీ.. పదే పదే అవే చూపించి, వాటిపై విసుగొచ్చేలా చేశారు దర్శకులు. వాటికి కొన్నాళ్లు బ్రేక్ పడింది కూడా. ఎలాగూ కాస్త గ్యాప్ వచ్చింది కదా, జనం పాత సినిమాల్ని మర్చిపోయి ఉంటారు.. అనుకుని ఈ కథ రాసుకున్నారు. విలన్ కి ఓ వీక్ నెస్ ఉండడం, దాన్ని ఆసరాగా చేసుకుని హీరో.. ఆటాడేసుకోవడం అనే పాయింట్ ని ఇంకా ఎంత కాలం పట్టుకుని సినిమా సముద్రాన్ని ఈదేస్తారో ఈ దర్శకులు. పోనీ పాత కథ, పాత సన్నివేశాలు, పాత పాయింటు అనుకుంటే.. ట్రీట్మెంట్ అయినా కొత్తగాఉండాలి కదా? కానీ… ప్రతీ సన్నివేశానికీ పదుల సంఖ్యలో రిఫరెన్సులు కనిపిస్తాయి. ఓసారి `నాయక్`, ఇంకోసారి `ఢీ`, మరోసారి.. `కందిరీగ`.. ఇలా వరుస కట్టేస్తుంటే.. దర్శకుడు కొత్తగా ఎక్కడ ఆలోచించినట్టు..? ద్వితీయార్థంలో ఆ హారర్ కామెడీ అయితే… భరించలేం. తెరపై లెక్కలేంతమంది కమెడియన్లను పెట్టుకుని.. వాళ్లని ఏవిధంగానూ వాడుకోలేని దర్శకుడు, రచయితల నిస్సహాయతను చూస్తుంటే జాలి కలుగుతుంది.
అల్లుడు శీను నుంచి శ్రీను… ఇదే టైపు బాడీ లాంగ్వేజ్ ని కొనసాగిస్తూ వచ్చాడు. అసలు కొత్తగా ఏమైనా నేర్చుకున్నాడా? అనేది పక్కన పెడితే.. నేర్చుకున్నవన్నీ మర్చిపోయినట్టు కొన్నిసన్నివేశాల్లో మరీ బేలగా కనిపిస్తుంటాడు. డాన్సుల్లో, ఫైటుల్లో తన మార్క్ చూపించాడు గానీ, కొన్ని చోట్ల.. డైలాగులు పలకడంలో మరీ ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమాలో సోనూసూద్ ది హీరో రేంజు పాత్ర అని ప్రేక్షకులు ఊహించుకున్నారు. కానీ మరోసారి బఫూన్ తరహా పాత్రలో.. సోనూని ఇరికించేశారు. అను ఇమ్మానియేల్, నభాలను గ్లామర్ పరంగానే చూడాలి. అంతకు మించి ఏం ఆశించకూడదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా రొటీన్ గా చేసే ప్రకాష్ రాజ్… రొటీన్ పాత్రని ఇంకెంత రొటీన్ గా చేసి ఉంటాడో ఊహించుకోవొచ్చు.
దేవిశ్రీ పాటల్లో కిక్ వుంది. పిక్చరైజేషన్ కూడా బాగుంది. కానీ.. ఆర్. ఆర్ మాత్రం మరీ మోతగా అనిపిస్తుంది. ఛోటా ఫొటోగ్రఫీ, ఆ కలర్లు… కనుల విందుగా ఉంది. కానీ ఏం లాభం? తెరపై అడ్డదిడ్డమైన సన్నివేశాలన్నీ ఒకొక్కటిగా వచ్చిపడిపోతుంటే.. ఆ ఫొటోగ్రఫీని టెక్నికల్ అంశాల్నీ గుర్తు పెట్టుకుని, మెచ్చుకునేంత ఆస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రచయితగా సంతోష్ శ్రీనివాస్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
`మాకు రొటీన్ నే కావాలి.` అని బలవంతంగా నిర్మాత ఒప్పిస్తే తప్ప.. ఇంత రొటీన్ స్టఫ్ బయటకు రాదేమో..? సినిమా చూసే ప్రేక్షకుల సంగతేమో గానీ, అసలు ఇలాంటి కథలతో హిట్టు కొట్టేద్దాం అన్న హీరో, దర్శకుడు, నిర్మాత గట్స్‌ని అభినందించాలి!
రేటింగ్: 1.5/5