పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు చేసిన చిట్ట చివరి ప్రయత్నమూ ఫెయిలయింది. 2021 ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖ ప్రచురించకపోవడంతో 2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల కమిషన్.,. పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల మూడున్నర లక్షల మంది యువ ఓటర్లు ఓటింగ్‌కు దూరమవుతారని.. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని.. తక్షణం ఎన్నికలు నిలిపివేసి.. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి దూళిపాళ్ల అఖిల అనే యువతి దాఖలు చేయగా..మరొకటి ఓ న్యాయవాది దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టి వేసింది.
2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో తనకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని ధూళిపాళ్ల అఖిల వాదించారు. అయితే.. ఆమె అసలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విషయాన్ని ఎస్ఈసీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను కొట్టి వేసే అవకాశం ఉందని ముందుగానే గుర్తించడంతో మరో లాయర్‌తోనూ అలాంటిపిటిషనే వేయించారు అధికార పార్టీ నేతలు. రెండింటిపైన విచారణ జరిపిన హైకోర్టు.. చివరికి జోక్యం చేసుకోలేమని తేల్చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణలో 2019 ఓటర్ల జాబితాను ఉపయోగించడానికి కారణలేమిటో ఎస్ఈసీ ప్రత్యేక అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు సమర్పిస్తుందని.. హైకోర్టుకు హామీ ఇచ్చినా గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లు ఓటర్ల జాబితాను ప్రచురించలేదని కోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్లి వారు చేసిన తప్పును చట్ట ప్రకారం… కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా తేలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఎస్ఈసీ అంత కఠినంగా వ్యవహరించలేదు. దీంతో ఆ అధికారులు ఇద్దరూ ఓటర్ల జాబితా విషయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు గురి కాకుండా ఈ పిటిషన్ విషయంలో బయటపడ్డారని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.