రాజకీయంగా ఉన్నారో లేరో అని వెదుక్కునే పరిస్థితిలో ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మళ్లీ యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారి మాత్రమే పోటీ చేశారు. ఇప్పుడు.. మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎల్.రమణ బరిలోకి దిగనున్నారు. రమణ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కానీ ఎమ్మెల్సీగా బరిలోకి దిగలేదు. అయితే రాజకీయంగా తాను స్తబ్ధంగా ఉంటే పార్టీ నాయకులు కూడా అంతే ఉంటారని… తాను యాక్టివ్ అవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడక ముందు జగిత్యాలలో ఎల్.రమణ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్లుగా ఉండేది. ఒక సారి రమణ.. మరోసారి జీవన్ రెడ్డి గెలుస్తూ వచ్చేవారు. తెలంగాణ ఉద్యమం రావడం… టీడీపీని ఆంధ్రప్రాంత పార్టీగా ప్రజల మనసుల్లో చొప్పించడంలో టీఆర్ఎస్ సక్సెస్ కావడంతో రమణ రాజకీయ పునాదులు కూడా కదిలిపోయాయి. అయితే పదవులు కోసం పార్టీ మారాలనే ఉద్దేశం లేని రమణ.. టీడీపీలోనే ఉండిపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా… తన నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఉండటంతో పోటీ నుంచి త్యాగం చేశారు. తర్వాత శేరిలింగం పల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం.. పొత్తుల్లో వచ్చిన సీట్లు తక్కువ కావడంతో దూరంగానే ఉన్నారు.
ఇప్పుడు మళ్లీ తన పార్టీని యాక్టివ్ చేసుకోవాలని ఎల్ రమణ నిర్ణయించుకున్నారు. కొన్ని ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయించుకుని… ఎమ్మెల్సీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. విద్యావంతుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ ఉందని.. అలాగే రమణపై మంచి అభిప్రాయం ఉందని నివేదికలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రకారం.. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సారి రాజధాని పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధండులు పోటీ పడుతున్నారు. వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉన్నారు. ఆయన గతంలో గెలిచారు కూడా.