నువ్వా? నేనా? అన్నట్టు సాగుతోంది. `మా` ఎన్నికల ప్రసహనం. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి, మైకులు పట్టుకుని అరచుకోవడం కామనే. అయితే.. వెనుక ఉన్నవాళ్లు సైతం… ఎవ్వరికీ తీసిపోలేదు. వాళ్లు సైతం ‘మా’ ఎన్నికల వేడిని రగల్చడానికి రెడీ అవుతున్నారు. మొన్నామధ్య `మా` బిల్డింగ్ వ్యవహారంలో మోహన్ బాబు జోక్యం చేసుకుంటూ.. ‘అప్పట్లో కొన్న మా బిల్డింగ్ ని ఎందుకు అమ్మేశారు’ అంటూ సూటిగా ప్రశ్నించారు. దానికి ఈరోజు నాగబాబు ధీటైన సమాధానం ఇచ్చారు.
ఇది వరకు ‘మా’కు సొంతంగా ఓ ఆఫీస్ ఉండేది. శ్రీనగర్ కాలనీలో 90 లక్షలకు రెండు ఫ్లాటులు కొన్నారు. అందు నిమిత్తం అన్ డివైడెడ్ షేర్ 145 గజాలు కూడా వచ్చింది. అయితే ఈ బిల్డింగ్ ని శివాజీ రాజా హయాంలో కేవలం 35 లక్షలకు అమ్మేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ విలువ సుమారు కోటిన్నర ఉంటుందని అంచనా. ఇదే విషయాన్ని నాగబాబు ఓ వీడియోలో అంకెలతో సహా చెప్పారు. ”మోహన్ బాబు గారు నా పేరు ప్రస్తావించలేదు. కానీ ఆ ఆఫీసు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కొన్నాం. ఆ తరవాత… పదేళ్లకు శివాజీరాజా అధ్యక్షుడిగా, నరేష్ సెక్రటరీగా ఉన్నప్పుడు వివిధ కారణాలు చెప్పి ఆ ఫ్లాట్ ని కేవలం 35 లక్షలకే అమ్మేశారు. ఇప్పుడు ఆ ఫ్లాట్ ధర కనీసం కోటిన్నర ఉంటుంది. ఆ ఫ్లాట్ ని ఎందుకు అమ్మేశారో.. నరేష్ నే అడగండి. నరేష్ ఇప్పుడు మీ ప్యానల్ కే సపోర్ట్ చేస్తున్నారు కదా? ఇక మీదట ఈ ప్రశ్న నన్ను అడిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి” అంటూ.. హెచ్చరించారు నాగబాబు.
ప్రకాష్ రాజ్ పై వస్తున్న విమర్శలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ కార్డు ప్లే చేయడానికి ప్రత్యర్థులు చూస్తున్న సంగతి ఆయన గుర్తు చేశారు. ”ఎంతకాలం సంకుచిత భావంతో బతుకుతాం. మనం ఆర్టిస్టులం. ఏ భాష అయినా సరే.. కళాకారుడ్ని గౌరవిస్తాం. తను ఏ భాషకు చెందినవాడో అనవసరం. `మా`కు మంచి చేస్తాడా? లేదా? అనేదే ముఖ్యం” అంటూ మరోసారి ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారు నాగబాబు.