ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటన్ మార్ట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మటన్ దుకాణాలు ప్రమాణ స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య కరమైన పరిస్థితుల్లో ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చడానికి మొబైల్ మటన్ దుకాణాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. మటన్ మార్ట్గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 మేకలు,గొర్రెలను మటన్గా మార్చే ఏర్పాట్లు అందులో ఉంటాయి. కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు వీలుగా ఆ వాహనాన్ని డిజైన్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసిన మాంసాన్ని నిల్వ చేసేందుకు రిఫ్రిజరేటర్లు ఇతర ఏర్పాట్లు ఉంటాయి.
వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ వాహనాలను యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ముందుగా 112 మంది లబ్దిదారుల్ని ఎంపికచేస్తారు. తర్వాత మండల కేంద్రాలు, పంచాయతీల్లో ఏర్పాటు కానున్నాయి. లబ్దిదారులు ఎవరు .. వారికి శిక్షణ వంటివాటిపై విధివిధానాలు కవర్ చేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కిందట లబ్దిదారులకు మేకలు, గొర్రెలు వంటి వాటిని పంపిణీ చేసింది. వాటి నుంచి వచ్చే మాంసాన్ని ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయడానికి ప్రపంచ ప్రసిద్ధ మాంసం ప్రాసెసింగ్ సంస్థ అల్లానాతో ఒప్పందం చేసుకుంది. అలా ఎగుమతులు పోను రాష్ట్రంలో ఇలా ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని అమ్మడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి కొత్త, వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.