టీడీపీ నేత నారా లోకేష్ ఇమేజ్ను పోలీసులు పని గట్టుకుని పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ రేంజి డీఐజీ, ఇద్దరు ఎస్పీలు, ఓ ఎమ్మెల్యే ప్రెస్మీట్లు పెట్టి నారా లోకేష్ నర్సరాపేటకు వస్తే, వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం దీనికి సాక్ష్యం. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కొన్నాళ్ల కిందట విష్ణువర్ధన్ రెడ్డి అనే ప్రేమోన్మాది చేతిలో కోట అనూష అనే విద్యార్థిని హత్యకు గురయింది. నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆమె కుటుంబానికి న్యాయం చేయలేదన్న ఉద్దేశంతో పరామర్శలకు వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. ఆయన కర్నూలు సహా పలు చోట్ల లోకేష్ పర్యటించారు. అక్కడక్కడ కొద్దిగా అడ్డుకుని ఆయన టూర్లకు ప్రచారం కల్పించారు.
ఇప్పుడు నర్సరావుపేట విషయంలో పోలీసులు మరీ ఎక్కువ యాక్షన్స్ ప్రారంభించారు. గుంటూరు ఐజీ సహా రూరల్, అర్బన్ ఎస్పీలు ప్రెస్‌మీట్ పెట్టారు. లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ప్రకటించారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అయితే హద్దులు కూడా దాటిపోయారు. అమరావతి ఉద్యమంలో స్వయంగా రైతులపై లాఠీచార్జ్ చేసిన ఆయన ఇప్పుడు అచ్చంగా వైసీపీ నేతల్లా ప్రకటనలు చేస్తున్నారు. గురువారం టీడీపీ నేత లోకేష్ పర్యటనకు అనుమతి లేదని .. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రభుత్వం రూ. పది లక్షలు ఇచ్చిందని కోట అనూష కుటుబంం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. లోకేష్ పర్యటన రాజకీయంగా ఉందని, అనుమతిలేని పర్యటనలకు రాజకీయ నాయకులు రావద్దని స్పష్టం చేశారు.
పోలీసులు అనుమతి లేదని చెప్పినా లోకేష్ గురువారం నర్సరావుపేట వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ పర్యటనపై అటు వైసీపీ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం.. ఇటు రేంజీ డీఐజీ సహా ఇద్దరు ఎస్పీలు ప్రెస్‌మీట్ పెట్టి అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. లోకేష్ ను నర్సరావుపేట వెళ్లనీయకుండా చేస్తేనే ఆయనకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. వెళ్లి బాధితుల్ని పరామర్శిస్తే రొటీన్‌గా సాగిపోతుంది.కానీ పోలీసులకు అలా ఇష్టం లేనట్లుగ ాఉంది.