ఈ దసరాకి పోటీ మామూలుగా ఉండదని ముందు నుంచే… ఊహాగానాలు మొదలైపోయాయి. `ఆచార్య`, `అఖండ`లు ఈ సీజన్లో పోటీకి దిగుతున్నాయని, వీటితో పాటు మరో రెండు సినిమాలు ఖాయమని… ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి `ఆచార్య` తప్పుకుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. `ఆచార్య` షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. దసరాకి ఈ సినిమాని సిద్ధం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయినా సరే.. దసరా బరిలో ఈసినిమా రావడం లేదట.
థియేటర్ల పరిస్థితి ఏమంత బాగాలేదు. మాస్ సినిమా వచ్చినా, స్టార్లు దిగినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే అనుమానాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీలో అయితే టికెట్ వ్యవస్థపై గందరగోళం నానాటికీ పెరుగుతూనే ఉంది. పైగా ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థ మొత్తం ఏపీ గరవర్నమెంట్ చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఇందులో లాభ నష్టాల్ని బేరీజు వేసుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం బలవంతంగా అమలు చేసినా చేయొచ్చు. కొంతకాలం పనితీరు పరిశీలించి, ప్రభుత్వం తన ప్రతిపాదన వెనక్కి తీసుకోవొచ్చ కూడా. ఇదంతా జరగాలంటే కొంత కాలం ఎదురు చూడాలి. ఇలాంటి గందరగోళాల మధ్య సినిమాని విడుదల చేయాలని ఏ నిర్మాతా భావించడు. ముఖ్యంగా పెద్ద సినిమాలు. అందుకే ఆచార్య దసరా బరి నుంచి డ్రాప్ అయ్యిందని సమాచారం. బహుశా.. ఆచార్య తదుపరి టార్గెట్ దీపావళి కావొచ్చు. మరి అఖండ సంగతేంటో చూడాలి.