కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి రూ. లక్ష జరిమానా విధించింది. దేవీ సీ ఫుడ్స్ అనే కంపెనీ గతంలో ప్రభుత్వం తమపై తీసుకున్న కొన్నిచర్యల విషయంలో హైకోర్టు ను ఆశ్రయించింది. ఈ విషయంలో చట్ట ప్రకారం చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దేవి సీ ఫుడ్స్ పై తీసుకున్న చర్యల విషయంలో వెనక్కి తగ్గకపోగా ఆ ఆదేశాలు అమలు చేయకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో సుప్రీంకోర్టు కూడా ఎలాంటి స్టే ఇవ్వనప్పటికీ ఆదేశాలు అమలు చేయలేదు.
చివరికి సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు.. రూ. లక్ష జరిమానా విధిస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. జరిమానా ఎంత అన్నది కాకుండా ఏ మాత్రం అర్థం పర్థం లేకుండా కింది కోర్టుల తీర్పులపై పైకోర్టులకు వెళ్లడం మినహా మరోఆలోచన చేయకపోవడం ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతోంది. గతంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టు జైలు శిక్షను విధించింది.
వారంతా హైకోర్టుకు హాజరై బిల్లులు చెల్లించామని శిక్షను రద్దు చేయాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసుకున్నారు. చివరకు డివిజన్ బెంచ్ వారి పిటిషన్‌ను అనుమతించి జైలు శిక్ష రద్దు చేసింది. అటు హైకోర్టు అయినా.. ఇటు సుప్రీంకోర్టు అయినా ప్రభుత్వానికి రోజు వారీ అక్షింతలు పడని రోజంటూ ఉండటం లేదు.