అండమాన్ నికోబార్ దీవుల పేర్లను కేంద్రం మార్చేసింది. ఇప్పుడు ఆ దీవుల పేర్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్. ఇక నుంచి అండమాన్ అని పిలవడానికి చాన్స్ లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్ అని పిలవాలి. కేంద్రం ఎందుకు ఈ పేరు మార్చిందంటే.. నేతాజీకి అన్యాయం జరిగిందట. ఆయనకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పేరు మార్చినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు.
అండమాన్ లో సారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలతో పాటు నేతాజీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన సభలో గుర్తు చేశారు. కానీ నేతాజీ జీవితాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుందన్నారు షా. ఎందుకంటే ఆయనకు తీరని అన్యాయం జరిగినట్లు తాను భావిస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదట.
చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకుల కీర్తి ప్రతిష్టలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గొప్ప నేతలు, మహానుభావులకు చరిత్రలో సరైన స్థానం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రకటించారు. ఇప్పటికే వీర్ సావర్కర్ వంటి వారిని గాంధీ కన్నా ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు.. చరిత్రను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విపక్షాల విమర్శల నేపధ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.