నిన్నటిదాకా ఆయనను హోంశాఖ షాడో మంత్రిగానే చెప్పేవారు. హోంమంత్రి సుచరిత ఎక్కడో దుకాణాలు, వ్యాపార సంస్థల ఓపెనింగ్‌లతో బిజీగా ఉంటే ఆమె తరపున పోలీసుల్ని చిటికెన వేలు మీద ఆడించే వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డికి పేరు ఉంది. ఇప్పుడు అది మరింత విస్తరించింది. ఆయనను సకల శాఖల మంత్రిగా చెబుతున్నారు. ఏపీలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆయనే ముందుకు వస్తున్నారు. ఓ రకంగా ప్రభుత్వం అంటే సజ్జల అంటే ప్రభుత్వం అన్న పరిస్థితి వచ్చేసింది. మొన్నటికి మొన్న ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్‌కి వెళ్తే ఎవరూ ఉండరు ఒక్క సజ్జల తప్ప అని తేల్చేశారు
ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ అదే పరిస్థితి. వైసీపీలో పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సజ్జలే. పార్టీ నేతలు ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో కూడా సజ్జలే దిశానిర్దేశం చేస్తారు. అందుకే ఇప్పుడు పదవులు రాని వారు.. గుర్తింపునకు నోచుకోని వారందరికీ సజ్జలే టార్గెట్ అవుతున్నారు. ఆయనపై విమర్శలు గుప్పించే వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. ఇప్పటి వరకూ బయట పార్టీల నేతలు .. సజ్జలకు ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆయన నియామకంపై కోర్టుల్లో పిటిషన్లు కూడా పడ్డాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు.
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి తాజాగా సజ్జలపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఏపీలో ముఖ్యమంత్రి.. మంత్రులు ఎంతోమంది ఉంటే సజ్జల ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సజ్జలపై వైసీపీలో ఇప్పటికే అంతర్గతంగా అసంతృప్తి ఉంది . ఆయన డామినేషన్‌పై అనేక మంది ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారు. కనీసం జగన్‌తో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని.. ఆయనతోనే అన్నీ చెప్పాలని అంటున్నారని అసంతృప్తిలో ఉన్నారు. అటు పార్టీలో .. ఇటు ప్రభుత్వంలో సజ్జలే ఎదురుగా కనిపిస్తూండటంతో జగన్ అపాయింట్మెంట్ దొరక్క చాలా మంది రగిలిపోతున్నారు. ఇప్పుడు డీఎల్ బయటకు వచ్చారు.. ముందు ముందు మరో ఇద్దరు ముగ్గురు నేతలు బయటకు వస్తే సజ్జల కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు.