తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై ఐఏఎన్ఎస్- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఫలితాలు కనిపించాయి. పూర్తి వివరాల్ని వెల్లడించకపోయినా తీవ్ర వ్యతిరేకత ఉన్నవారు… అత్యంత తక్కువ వ్యతిరేకత ఉన్న వారి వివరాలను ప్రకటించారు. ఈ ప్రకారం ఏపీలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని తేలింది. ఇరవై ఎనిమిదిశాతానికిపైగా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. ఇప్పటికి పాలన ప్రారంభమై రెండున్నరేళ్లు కూడా కాలేదు. ఎమ్మెల్యేలు అత్యధిక మంది మొదటి సారి గెల్చిన వాళ్లే. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ వ్యతిరేకత వచ్చిందంటే క్లిష్టమైన అంశమే. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌కు స్పష్టమైన ఆప్షన్ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వచ్చే ఎన్నికల్లో మార్చేస్తారు.
అదే ముఖ్యమంత్రుల విషయానికి వస్తే అటు అత్యంత ఎక్కువ వ్యతిరేకత.. అలాగే అతి తక్కువ వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ లేరు. అంటే.. ఎమ్మెల్యేలను మార్చుకుని కొంత వరకు పరిస్థితుల్ని చక్కదిద్దుకోవచ్చు. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. ఎమ్మెల్యేలపై అత్యంత ఎక్కువ అసంతృప్తి ఉన్న టాప్ త్రీలో తెలంగాణ ఉంది.అలాగే సీఎం కేసీఆర్‌పై ప్రజలు ఎక్కువ అసంతృప్తితో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సీఎంపై లేనంత అసంతృప్తి కేసీఆర్‌పై ప్రజల్లో ఉందని తేలింది. ఎమ్మెల్యేలను అంటే మార్చేయవచ్చు..కానీ కేసీఆర్ పైనే అసంతృప్తి ఉంటే ఏం చేస్తారు..?
ఇప్పుడుకేసీఆర్ ముందు ఓ ఆప్షన్ ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఆ ఆప్షన్ ఆయన అనుకుంటున్నదే. అదే కేసీఆర్‌ను మార్చేయడం. అంటే కేటీఆర్‌కు పగ్గాలివ్వడం. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల్లో మళ్లీ సానుకూలత వస్తుందని సర్వేసంకేతాలు ఇచ్చింది. ఇదే సరైన సమయం అని ఆయనకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చిందని అంటున్నారు. కేసీఆర్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారో లేదో కానీ..హుజురాబాద్ ఎన్నికల తర్వాత మాత్రం రాజకీయం మారడం ఖాయంగా కనిపిస్తోంది.