ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో బహిరంగసభలకు అనుమతి లేకపోవడంతో పొరుగు నియోజకవర్గాల్లో భారీ సభ పెట్టాలని అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ ప్రయత్నాలనూ ఎన్నికల సంఘం అడ్డుకుంది. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకార కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనుంది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఒక మున్సిపల్ కార్పొరేషన్లో లేదా మెట్రోపాలిటన్ నగరంలో లేదా రాష్ట్ర రాజధానిలో ఉన్నట్లయితే ఎలక్షన్ కోడ్ కేవలం ఆ నియోజకవర్గ పరిధిలోకి మాత్రమే ఉంటుందని, కానీ ఈ మూడు విభాగాలకు చెందని నియోజకవర్గం అయినట్లయితే మొత్తం జిల్లాకు వర్తిస్తుందని ఈసీ తాజా నోటీసులు ఇచ్చింది.
నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగసభలు పెట్టడం కోడ్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధం అని స్పష్టం చేసింది. దీంతో టీఆర్ఎస్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. కేసీఆర్ ప్రచారాన్ని రెండు రోజుల పాటు పెంచి.. రోడ్ షోలు నిర్వహించానే ఆలోచన చేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారం చేయాలనే ఆలోచనలో లేరని టీఆర్ఎస్లో ఓ వర్గం చెబుతోంది. కేటీఆర్ కూడా ఇంత వరకూ కేసీఆర్ ప్రచారంపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
కేటీఆర్, కేసీఆర్ ఎవరూ ప్రచారానికి వెళ్లకపోతే.. మొత్తం హరీష్ మీద వదిలేశారని.. ఆయనను బలి పశువును చేస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్న కారణంగా అవి మరింత పెరుగుతాయి. అందుకే కేసీఆర్ రెండు రోజుల పాటు రోడ్ షోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ నుంచి కూడా అగ్రనేతలు ఎవరూ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఎవరి పేరు ఖరారు కాలేదు. ఇదే అంశంపై టీఆర్ఎస్లో తర్చన భర్జన జరుగుతోంది.