వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అత్యంత హీనంగా ఉంది. ప్రభుత్వం అయినా.. పార్టీ అయినా గౌరవంగా మాట్లాడటానికి మాత్రం తెర ముందుకు ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తున్నారు. ఇక బూతులకు మాత్రం ఆ పార్టీ నేతలను వదులుతున్నారు. ఎవరు ఏం మాట్లాడాలో వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఆయన తన టీంతో సందేశాలు పంపుతారు. దానికి తగ్గట్లుగా వైసీపీ నేతలు చెలరేగిపోతారు. కానీ ఆయన మాత్రం మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలు బూతులు మాట్లాడారని.. తాము అలాంటి వాటిజోలికి పోబోమని చెబుతారు. అంటే… బూతులు మాట్లాడిన తమ నేతల్ని కూడా ఆయన తప్పు పట్టినట్లవుతోంది. ఆయన మాత్రం ప్రెస్మీట్లో ఎక్కడా మాట తూలరు. ప్రజాస్వామ్య భాషే వాడతారు.
ప్రభుత్వంలోనూ అంతే. వివాదాస్పద నిర్ణయాలు.. ప్రకటనలను అధికారులు..అధికారుల సంఘంతో చేయిస్తారు. అందరినీ రాజకీయంగా ఉపయోగించుకుంటారు. ఆయన మాత్రం తనకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉంటారు. పోలీసు అధికారుల సంఘాన్ని రాజకీయంగా ఇంత వరకూ ఎవరూ ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పటి వరకూ వైసీపీ నేతల కన్నా ముందే పోలీసు అధికారు ల సంఘం వస్తోంది. వారి తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ గౌతం సవాంగ్ పైనా అదే తరహా చర్చ నడుస్తోంది. ఆయనకు ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్ అని పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ప్రకటనలు చూసి.. సోషల్ మీడియాలో ఎలా పిలుస్తున్నారో చెప్పడం కష్టం. అన్నీ చేయిస్తోంది సజ్జలే అని అందరికీ తెలుసు. కానీ నిందలన్నీ ప్రభుత్వంలో ఉన్న వారు పడుతున్నారు. కానీ సజ్జల మాత్రం అత్యంత అమాయకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు.
అటు ప్రభుత్వంలో లీడర్లను ప్రజల్లో చులకన చేసి.. ఇటు ఉన్నతాధికారుల్ని.. వ్యవస్థల్ని కూడా చులకన చేసి.. సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ లాభం పొందుతున్నారు. తమకు కావాల్సిన పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రత్యర్థుల్ని వేధించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన వ్యూహంలో భాగమైన వారంతా ప్రత్యర్థి పార్టీకి టార్గెట్లుగా మారారు. కొంత మంది చట్టంలో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరేమైపోయినా సజ్జలకు మాత్రం పోయేదేమీ ఉండదు. ఎందుకంటే నేరుగా ఆయన చేస్తున్నదేమీ లేదు.