ఆంధ్రప్రదేశ్లో విఫలమైన పోలీసు వ్యవస్థ,తమ పార్టీ నేతలు కార్యాలయాలపై జరిగిన దాడులు అంశాలపై వివరించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బృందం సోమవారం ఢిల్లీ వెళ్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది. అయితే రాష్ట్రపతికి చేసే ఫిర్యాదుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్య పద్దతిలో ఫిర్యాదులు చేశామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా.. కట్టడి కావాలన్నా కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి జోక్యం ఉండాల్సిందే.
అందుకే చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడులు జరిగిన రోజున ఆయననేరుగా అమిత్ షాకు ఫోన్ చేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేరుగా తనే ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ వెళ్తున్నారు. మామూలుగా అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైందన్న ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ వరకు ఖరారైంది. సోమవారం లోపు మోడీ, షా అపాయింట్మెంట్లు కూడా తీసుకుంటే వారికి కూడా ఫిర్యాదు చేస్తారు.
అయితే వారు అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది రాజకీయ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ వారు సమయం ఇస్తే వైసీపీ నేతలకు ఇబ్బందికరమే అవుతుంది. ఇప్పటి వరకూ చంద్రబాబును బూచిగా చూపిస్తూ ఢిల్లీలో రాజకీయాలు నడిపారు. ఇప్పుడు బూచి కాదు అని వారు భావించడం ప్రారంభిస్తే వైసీపీకి గడ్డు పరిస్థితులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబుకు మోడీ, షాలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నదానిపైనే చర్చ జరుగుతోంది.