వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదుల్లో చెరో గోల్ సాధించారు. రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బ్యాంకులు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని.. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చారని ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. దీనిపై ఆర్బీఐ స్పందించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ఆర్బీఐ సీజీఎం జయశ్రీ గోపాలన్ విజయసాయిరెడ్డి ప్రత్యుత్తరం ఇచ్చారు. విజయసాయిరెడ్డి మూడు నెలల క్రితం ఈ ఫిర్యాదు చేశారు.
మరో వైపు వైసీపీ ఎంపీలు తమ ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధిత కార్యక్రమాలకు వాడుతున్నారంటూ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. లేఖతో పాటు రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదును కూడా జత చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎంపీలకు కేటాయించిన నిధులతో బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఖర్చు చేశారన్న ఫిర్యాదుపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని కోరింది. చాలాచోట్ల ఇదే తరహాలో ఖర్చు చేశారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర స్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులనూ ఈ అంశంపై వివరణ అడిగింది. మోస్ట్ అర్జంట్‌గా కేంద్రం పేర్కొన్నది.
వైసీపీ ఎంపీలు..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రఘురామకృష్ణరాజు.. ఆయనను ఇబ్బంది పెట్టాలని.. వైసీపీ, విజయసాయిరెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తరచూ రఘురామకృష్ణరాజుకు పై చేయి అవుతోంది. కానీ ఈ సారి విజయసాయిరెడ్డి కూడా రెస్పాన్స్ సాధించారు. కానీ ఆర్బీఐ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చి ఉంటే… బ్యాంకర్లపైనే చర్యలు తీసుకుంటారు కానీ రఘురామరాజుపైన కాదని భావిస్తున్నారు. ఏదైనా కానీ ఓ అంశంలో రఘురామను చికాకు పెట్టామన్న సంతృప్తి విజయసాయిరెడ్డికి దక్కింది.