తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏమీ తెలియకూడదని అనుకుంటోంది. ఎలాంటి సమాచారం చెప్పాలన్నా .. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా సరే చెప్పొద్దని.. తమ అనుమతి ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చింది. పథకాలు, లబ్దిదారులు, ప్రభుత్వ నిర్ణయాలు.. ఇలా ఏదైనా సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. సమాచార హక్కు చట్టంకింద ఓ దరఖాస్తు చేస్తే మొత్తం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ ఇప్పుడు అవి వివాదాస్పదం అవుతాయన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోకుండా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదని జీవో ఇచ్చేసింది.
గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న సమాచారం కోసం ఆర్టీఐ దరఖాస్తు చేసినా.. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతి కావాలి. అధికారులకు అంత తీరిక ఉండదు. తెలంగాణ సర్కార్ ఇటీవల జీవోలు కూడా వెబ్ సైట్లో పెట్టడం లేదు. దానిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైతే.. ప్రభుత్వ నిర్ణయాలను ఇరవై నాలుగు గంటల్లో వెబ్సైట్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. అయితే వివిధ రకాల కేటగిరిలలో చూపించి ఇప్పటికి చాలా జీవోలు పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ సమాచారం ఎందుకు దాచాలనుకుంటున్నారో సామాన్యులకు అర్థం కాని పరిస్థితి. తప్పులు.. లోపాలు.. కుంభకోణాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని సహజంగానే మిగిలిన అందరూ ప్రచారం చేస్తారు. ఇటీవల ప్రభుత్వంపై హైకోర్టులో దాఖలవుతున్న అనేక కేసుల్లో ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకున్నారు. భూముల వేలం విషయంలోనూ అదే జరిగింది. హైకోర్టు భూముల వేలంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కొంత మంది పాతరికార్డులను సమాచార హక్కు చట్టం కింద సేకరించి హైకోర్టుకు సమర్పించడమే.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతోనే .. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డాక్యుమెంట్లను కూడా బయటపెడుతున్నారు. రాజకీయంగా కీలక సమయానికి చేరడంతో ఇక అలాంటి సమాచారం అందుబాటులో ఉంచకపోవడమే మంచిదని తెలంగాణ సర్కార్ భావించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.