ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా ఏపీ నుంచి రవాణా అవుతూ పట్టుబడుతున్న డ్రగ్స్, గంజాయి వ్యవహారాలు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతున్నాయి. తాజాగా మరొకటి పట్టుబడింది. ఈ సారి నేరుగా నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేస్తున్నారు. నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు చేరాల్సిన ఈ డ్రగ్స్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుకోవడంతో వెలుగు చూసింది.
నర్సాపురం నుంచి లెహంగాలు ఆస్ట్రేలియాకు బుక్ అయ్యాయి. ఈ లెహంగామాల మధ్య స్మగ్లర్లు డ్రగ్స్ పెట్టారు. సమాచారం అందడంతో ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. లెహంగాల్లో మూడు కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. దీని విలువ రూ. కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి నరసాపురం నుంచి ఆ పార్సిల్‌ను బుక్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో విశాఖకు చెందిన వ్యక్తితో పాటు చెన్నైకు చెందిన వారిని అరెస్ట్ చేశారు. నర్సాపురం టు ఆస్ట్రేలియా డ్రగ్స్ రవాణా అని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఏపీలోనూ రాజకీయ కలకలం బయలుదేరింది.
ఏపీలో అడ్రస్‌లు తప్ప డ్రగ్స్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఏపీలోనే అడ్రస్‌లు ఎందుకు ఉంటున్నాయనే సంగతిని మాత్రం చెప్పలేకపోతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… ఏపీలోనే అడ్రస్‌లు పెట్టుకుని వ్యాపారం చేసుకునేంత సేఫ్ జోన్‌గా ఎందుకు మార్చుకుంటున్నారో.. ఎవరు సహకరిస్తున్నారో మాత్రం పోలీసులు విచారణ చేయడానికి సిద్ధంగా లేరు. తాము ఏమీ లేదని చెప్పాం కాబట్టి… ఏమైనా ఉందని చెబితే.. అరెస్ట్ చేస్తాం..లేకపోతే బీపీలు తెచ్చుకున్న వారితో కలిసి దాడులు చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి.