తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న ఓ హిందీ పదానికి బూతు అర్థం బహిరంగంగా.. తన నోటితోనే చెప్పుకుని తన తల్లిని కించ పరుస్తున్నారని జగన్ బాధపడ్డారు. అయితే ఆయన తీరుపై టీడీపీ నేతలు అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా తల్లిపై అంత అభిమానం ఉంటే ఎందుకు ఆమెకు కనీసం గౌరవం ఇవ్వడంలేదని.. ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలు అందరూ చేస్తున్నారు. అయితే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం మరింత భిన్నమైన విమర్శలు చేశారు. నిజంగా తల్లిపై అంత అభిమానం ఉంటే.. ఆమెను తిట్టిన వారికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. పోటీగా పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసేవారు . ఆ సమయంలో వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో వైసీపీ పక్ష నేతగా ఉండేవారు. అధికార పార్టీ తరపున బొత్స మాట్లాడేవారు. విజయమ్మపై దారుణమైన విమర్శలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా విజయమ్మను తిట్టిన వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి వివాదంరేపారు.
తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నారని జగన్పై వెల్లువెత్తుతున్న విమర్శలతో.. ప్రస్తుతం గతంలో విజయమ్మపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల అంశం తెరపైకి వస్తోంది. వైసీపీలో ఉన్న ఆనం, బొత్స, కన్నబాబువంటి సీనియర్లు వైసీపీపై.. విజయమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. దీన్నే గుర్తు చేస్తున్నారు. సానుభూతి వస్తుందంటే … తన మొహంపై తానే ఉమ్మేసుకుంటారని జగన్పై అయ్యన్న సెటైర్లు వేస్తున్నారు.